Tamil Nadu: ఏఐఏడీఎంకే పార్టీకి సీనియర్ నటి గౌతమి రాజీనామా!
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. AIADMK పార్టీకి ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త గౌతమి తడిమళ్ల సడెన్ గా రాజీనామా చేశారు.
Tamil Nadu: ఏఐఏడీఎంకే పార్టీకి సీనియర్ నటి గౌతమి రాజీనామా!
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (AIADMK) పార్టీకి ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త గౌతమి తడిమళ్ల సడెన్ గా రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన కీలక పదవికి కూడా ఆమె రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
బరువెక్కిన హృదయంతో నిర్ణయం.. ఎడప్పాడికి లేఖ
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అంతర్గత పరిణామాల నేపథ్యంలోనే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె. పళనిస్వామికి ఒక లేఖ రాశారు. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని, సామాజిక సేవపై మరింత పకడ్బందీగా దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే బరువెక్కిన హృదయంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, డిప్యూటీ ప్రచార కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో స్పష్టం చేశారు. తాను పార్టీలో ఉన్నంత కాలం సహకరించిన మాజీ మంత్రులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు.
గౌతమి తడిమళ్ల రాజకీయ ప్రస్థానం
సినీ రంగంలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న గౌతమికి రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆమె మొదట 1997లో ఎల్.కె. అద్వానీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఆ సమయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తరఫున ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కుమార్తె పుట్టిన తర్వాత రాజకీయాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె, తిరిగి 2017లో బీజేపీలో యాక్టివ్ అయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాజపాళయం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరించారు.
అయితే, తన ఆస్తుల విషయంలో మోసం చేసిన వ్యక్తికి పార్టీలోని కొందరు సీనియర్ నేతలు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ 2023 అక్టోబర్‌లో ఆమె బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14, 2024న ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో ఏఐఏడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఆమె సేవలని గుర్తించి అక్టోబర్ 21, 2024న డిప్యూటీ ప్రచార కార్యదర్శిగా నియమించింది. కేవలం రాజకీయాలే కాకుండా, క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు ఆమె 'లైఫ్ అగైన్ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల పరాజయం తర్వాత ఏఐఏడీఎంకేకు వరుస షాకులు
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐఏడీఎంకే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నికల పరాజయం తర్వాత పార్టీ నుండి కీలక నేతలు వరుసగా వలస బాట పడుతున్నారు. ముఖ్యంగా నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీలోకి నేతలంతా క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గౌతమి కూడా రాజీనామా చేయడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




