తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వస్తాయా? టీవీకే మద్దతుపై డీఎంకే సెన్సేషనల్ కామెంట్స్..!

Vijay Meets TVK MLAs: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ? కొత్త ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ. పెరంబూర్ స్థానాన్ని అట్టిపెట్టుకోనున్న దళపతి. టీవీకే ప్రభుత్వానికి అన్నాడీఎంకే మద్దతు తప్పనిసరి అన్న డీఎంకే నేత ఇళంగోవన్.

Arun Chilukuri
Published on: 5 May 2026 4:05 PM IST
తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వస్తాయా? టీవీకే మద్దతుపై డీఎంకే సెన్సేషనల్ కామెంట్స్..!
X

తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వస్తాయా? టీవీకే మద్దతుపై డీఎంకే సెన్సేషనల్ కామెంట్స్..!

Vijay Meets TVK MLAs: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కజగం (TVK) ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మంగళవారం చెన్నైలో పార్టీ అధినేత విజయ్ తన కొత్త ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో శాసనసభాపక్ష నేత ఎన్నికతో పాటు, మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు అవసరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ ఎన్నికల్లో విజయ్ రెండు చోట్ల (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. అయితే, ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో టీవీకే రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించింది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపై డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ.. "కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతుతో విజయ్ గట్టెక్కలేరు. ఆయనకు అన్నాడీఎంకే మద్దతు కూడా తప్పనిసరి. ఒకవేళ ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోతే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రాక తప్పదు" అని వ్యాఖ్యానించారు.

విజయ్ బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. అతిపెద్ద పార్టీగా తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరనున్నారు. మరోవైపు, ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఇప్పటికే ఆమోదించారు. దీంతో బుధవారం విజయ్ గవర్నర్‌ను కలిసిన తర్వాత తమిళనాడులో కొత్త ప్రభుత్వంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story