Vijay: అసలైన తమిళ రాజకీయం చూస్తున్న విజయ్.. ప్రమాణస్వీకారం రద్దు
Vijay: మెజారిటీ వచ్చినా అధికారం దక్కని వైనం. తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురవుతున్న సవాళ్లు, కాంగ్రెస్ ఎంట్రీతో మారిన సమీకరణాలు.
Vijay: అసలైన తమిళ రాజకీయం చూస్తున్న విజయ్.. ప్రమాణస్వీకారం రద్దు
Vijay Tvk: తమిళనాడులో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చదరంగం నడుస్తోంది. వెండితెరపై వందల మంది విలన్లను ఒంటిచేత్తో తుదముట్టించే దళపతికి, నిజ జీవిత రాజకీయాల్లోని వ్యూహప్రతివ్యూహాలు అసలైన సవాల్‌ను విసురుతున్నాయి. మెజారిటీకి చేరువలో నిలిచినా, గద్దె నెక్కడం అంత సులువు కాదని విజయ్‌కు అర్థమవుతోంది. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తయితే, ఇప్పుడు జరుగుతున్న నంబర్ గేమ్ మరో ఎత్తు. అత్యధిక సీట్లు సాధించినా, మ్యాజిక్ ఫిగర్ అందనంత దూరంలో ఉండటంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే డైలమాలో పడింది.
విజయ్ విజయంలో కీలక పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్, డీఎంకేకు షాక్ ఇచ్చి టీవీకే పంచన చేరింది. అయితే ఇదే ఇప్పుడు విజయ్‌కు కొత్త తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నిర్ణయంతో అలిగిన సీపీఐ, సీపీఎం పార్టీలు.. డీఎంకే కూటమిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. అటు ఐయూఎంఎల్ కూడా డీఎంకే వైపే మొగ్గు చూపడంతో విజయ్‌కు రావాల్సిన అదనపు బలం తగ్గిపోయింది. మెజారిటీ ఉందని నమ్మకంతో గవర్నర్‌ను కలిసిన విజయ్‌కు చుక్కెదురైంది. ముందు నంబర్స్ చూపించండి.. ఆ తర్వాతే ఆహ్వానం అని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ స్పష్టం చేయడమే కాకుండా, ఆయన కేరళ పర్యటనకు వెళ్ళిపోయారు. దీంతో రేపు జరగాల్సిన అట్టహాసమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయ్యింది.
అన్నాడీఎంకే షరతులు..
బలం కోసం అన్నాడీఎంకే వైపు చూస్తే అక్కడ మరో పెద్ద అడ్డంకి ఎదురైంది. కాంగ్రెస్ ఉన్న చోట మేము ఉండము అని అన్నాడీఎంకే భీష్మించుకుని కూర్చుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ను కాదనుకోలేక, అన్నాడీఎంకే మద్దతు లేక విజయ్ సందిగ్ధంలో పడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విజయ్ ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం. ఇది అత్యంత రిస్కుతో కూడుకున్న పని. కాంగ్రెస్ మద్దతు వదులుకుని అన్నాడీఎంకే చెప్పినట్లు నడుచుకోవడం.
డీఎంకే - అన్నాడీఎంకే దోస్తీ..?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నట్లు.. విజయ్‌ను అడ్డుకునేందుకు దశాబ్దాల శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే గనుక జరిగితే తమిళనాడు రాజకీయ చరిత్రలో అది అతిపెద్ద సంచలనంగా మారుతుంది.
సినిమా క్లైమాక్స్‌లో లాగా విలన్లను కొట్టి గెలవడం రాజకీయాల్లో సాధ్యం కాదు. ఇక్కడ కావాల్సింది వ్యూహం, చాణక్యం. మెజారిటీ సీట్లు సాధించినా, అధికారం అందుకోవడానికి విజయ్ పడుతున్న ఈ పాట్లు చూస్తుంటే.. ఆయనకు ఇప్పుడు అసలైన రాజకీయాలు రుచి తగులుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.




