Thalapathy Vijay : చరిత్ర సృష్టించిన విజయ్.. 50 ఏళ్ల రికార్డులు బద్దలు, ముఖ్యమంత్రిగా ఇవాళే ప్రమాణం
Thalapathy Vijay : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్ తో పాటు మరో 9మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
Thalapathy Vijay
Thalapathy Vijay : తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సినిమా స్క్రీన్ మీద తన మేజిక్‌తో కోట్లాది మందిని అలరించిన దళపతి విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో ప్రజా నాయకుడిగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. అడ్డంకులు అన్నింటినీ దాటుకుని, గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇవాళ ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడు గడ్డపై దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతున్న ద్విముఖ రాజకీయాలకు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) చెక్ పెట్టింది. 1967 తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తొలి ద్రవిడేతర పార్టీగా టీవీకే చరిత్ర సృష్టించింది. కేవలం పార్టీ పెట్టిన తక్కువ సమయంలోనే ఒంటరిగా పోటీ చేసి, అతిపెద్ద పార్టీగా అవతరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్ర పార్టీల కోటను బద్దలుకొట్టి విజయ్ సాధించిన ఈ విజయం ఇప్పుడు యావత్ భారతాన్ని తమిళనాడు వైపు చూసేలా చేస్తోంది.
సంఖ్యాబలం సాధన.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న సందిగ్ధతకు వీసీకే (VCK) పార్టీ మద్దతుతో ముగింపు పలికింది. టీవీకేకు ఉన్న 107 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ (5), సిపిఐ (2), సిపిఎం (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2) పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో కూటమి బలం 120కి చేరింది. 118 మంది సభ్యుల మద్దతు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్‌ను సీఎంగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మే 13వ తేదీలోగా అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు.
మంత్రులుగా ప్రమాణం చేయనున్న ఎమ్మెల్యేలు వీరే
చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం విజయ్ ప్రమాణస్వీకార వేడుకకు వేదికైంది. విజయ్‌తో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇందులో కీలకమైన ట్విస్ట్ ఏంటంటే.. చాలా కాలం తర్వాత తమిళనాడు కేబినెట్‌లో కాంగ్రెస్ ఎంట్రీ ఇస్తోంది. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇవాళ ప్రమాణం చేసే తొమ్మిది మందిలో ఒకరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండగా, మిగిలిన ఎనిమిది మంది టీవీకే పార్టీకి చెందిన ముఖ్య నేతలు. పరిపాలనలో కొత్త రక్తాన్ని ఎక్కించేలా విజయ్ తన మంత్రివర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.




