Wayanad Landslide: వయనాడ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఇద్దరు కార్మికులు బలి
Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌లో మరోసారి ఘోర విపత్తు సంభవించింది. అనక్కంపొయిల్-కల్లాడి సొరంగం నిర్మాణ స్థలం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు దుర్మరణం చెందారు.
Wayanad Landslide: వయనాడ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఇద్దరు కార్మికులు బలి
Wayanad Landslide: కేరళలోని మలేరియా ప్రభావిత పర్వత ప్రాంతమైన వయనాడ్ జిల్లాలో మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అత్యంత భారీ వర్షాల కారణంగా ప్రతిష్టాత్మక 'అనక్కంపొయిల్-కల్లాడి' సొరంగం నిర్మాణ స్థలం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో మంగళవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విపత్తులో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద మరో 30 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానిక యంత్రాంగం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బందితో కలిసి రంగంలోకి దిగింది. కొండచరియల శిథిలాల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది చాకచక్యంగా రక్షించి, చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రాంతంలో ఇంకా భారీ వర్షం కురుస్తుండటం, దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రమాద స్థలానికి సమీపంలో నివసిస్తున్న సుమారు 100 మందిని అధికారులు గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు (పునరావాస కేంద్రాలకు) తరలించారు.
ఈ భారీ కొండచరియల కారణంగా మలప్పురం - వయనాడ్‌లను అనుసంధానించే ప్రధాన రహదారి మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన మీనాక్షి వంతెన వద్ద నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలో ప్రయాణాలను పూర్తిగా నిషేధించారు.
వయనాడ్ ఘోర ప్రమాదం గురించి తెలియగానే కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శిథిలాల కింద ఉన్న ప్రతీ ఒక్కరినీ ప్రాణాలతో రక్షించడమే మొదటి ప్రాధాన్యత కావాలని, ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, సిద్దిఖీలు పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించేందుకు హుటాహుటిన వయనాడ్‌కు బయల్దేరారు.




