Wayanad Tragedy : రెండేళ్లయినా మారని బతుకులు.. మళ్లీ భయపెడుతున్న కొండచరియలు.!
Wayanad Tragedy : వయనాడ్‌లో వందలాది మంది ప్రాణాలను బలితీసుకుని, అక్కడి రూపురేఖలనే మార్చేసిన చూరల్‌మల - ముండకై కొండచరియల ఘోర విపత్తు జరిగి అప్పుడే రెండేళ్లు
Wayanad-Tragedy
Wayanad Tragedy : వయనాడ్‌లో వందలాది మంది ప్రాణాలను బలితీసుకుని, అక్కడి రూపురేఖలనే మార్చేసిన చూరల్‌మల - ముండకై కొండచరియల ఘోర విపత్తు జరిగి అప్పుడే రెండేళ్లు అయిపోయింది. ఆ దారుణం జూలై 2024 లో జరిగింది. ఆ భయంకరమైన నైట్‌మేర్ నుండి అక్కడి ప్రజలు ఇంకా కోలుకోకముందే, తాజాగా వయనాడ్ సమీపంలోని కల్లాడిలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కొత్త ప్రమాదం చిన్నదే అయినప్పటికీ, పాత గాయాలను మళ్లీ రేపి బాధితులను తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేసింది.
టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్.. భద్రతపై ఆందోళనలు
కోజికోడ్ - వయనాడ్ మధ్య ప్రత్యామ్నాయ మార్గం కోసం నిర్మిస్తున్న ఒక భారీ ట్విన్-ట్యూబ్ టన్నెల్ ప్రాజెక్ట్ సైట్ సమీపంలోనే ఈ కొత్త ప్రమాదం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో చేపడుతున్న పెద్ద పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి ఎంతవరకు ముప్పు ఉందనే చర్చ మళ్లీ మొదలైంది. కనెక్టివిటీ పెరగడం ముఖ్యమే అయినా, ప్రాణాల కంటే అభివృద్ధి ముఖ్యం కాదని స్థానికులు వాపోతున్నారు. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం, ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిగే వరకు టన్నెల్ ప్రాజెక్ట్ పనులన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
‘త్రీ బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్’.. గుండెను పిండేసే కథ
ప్రభుత్వం నిర్మిస్తున్న మోడల్ పునరావాస టౌన్‌షిప్‌లో మొదటి విడతగా 178 ఇళ్లను కట్టి ఈ ఏడాది మార్చిలో బాధితులకు తాళాలు అందజేశారు. అలా కొత్త ఇంట్లోకి మారిన వారిలో అనీష్, సాయన దంపతులు ఉన్నారు. 2024 నాటి ఘోర ప్రమాదంలో ఈ దంపతులు తమ ముగ్గురు కొడుకులను, అనీష్ తల్లిని, మేనల్లుడిని కోల్పోయారు.
తమ పిల్లల జ్ఞాపకార్థం వాళ్లు తమ కొత్త ఇంటికి "త్రీ బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్" అని పేరు పెట్టుకున్నారు. ఇల్లంతా పిల్లల ఫొటోలు, వాళ్ల బొమ్మలు, వస్తువులతో ఒక ప్రత్యేకమైన కార్నర్ ఏర్పాటు చేసుకున్నారు. "మా వయనాడ్ ఎంతో అందమైనది, అలాంటిది ఇలా నాశనమైపోతుంటే చూడలేకపోతున్నాం. మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయనే వార్త వినగానే గుండె ఆగినంత పనైంది" అని అనీష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా పూర్తికాని పునరావాసం.. ఎదురుచూపులు
టౌన్‌షిప్‌లో ఇళ్లు దక్కక, ఇంకా తాత్కాలిక ప్రభుత్వ క్వార్టర్స్‌లోనే నరకం చూస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో రషీద్, సెరీనా దంపతులు ఒకరు. ఆఫీసర్ల బదిలీలు, కూలీల కొరత వల్ల ఇళ్ల నిర్మాణం చాలా లేట్ అవుతోందని రషీద్ ఆరోపించారు. అధికారులు సెప్టెంబర్ కల్లా ఇళ్లు ఇస్తామంటున్నా, పనులు జరుగుతున్న స్పీడ్ చూస్తే వచ్చే ఏడాది జనవరి వరకు అయ్యేలా లేదు. వారి 15 ఏళ్ల కూతురు ఈ తాత్కాలిక ఇల్లు చూసి, ఎప్పుడు ఏం జరుగుతుందో అని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది. టౌన్‌షిప్‌కు మారితేనే ఆ పిల్ల నార్మల్ అవుతుందని కౌన్సెలర్లు చెబుతున్నా, ఇళ్ల కేటాయింపులో ఆలస్యం వారిని మరింత వేధిస్తోంది.
భయం నీడలో వయనాడ్
వయనాడ్‌లో మళ్లీ వర్షకాలం మొదలైంది. ఇప్పుడు అక్కడ చిన్న వాన పడినా, కొండలపై నుండి మట్టి జారినా బాధితులకు ఆనాటి భయంకరమైన రాత్రి గుర్తొచ్చి వణికిపోతున్నారు. ఇళ్లనైతే మళ్లీ కట్టుకోవచ్చు కానీ, మనసుల్లో నాటుకుపోయిన భయాన్ని పోగొట్టడం అంత ఈజీ కాదని కల్లాడి ఘటన నిరూపించింది. అభివృద్ధి, పునరావాసం ముఖ్యాంశాలే అయినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మళ్లీ జరగకుండా చూడటమే ఇప్పుడు వయనాడ్ ముందున్న అతిపెద్ద సవాలు.




