West Bengal Elections 2026: యువతకు ఏడాదికి 18 వేలు..మమత హామీలు మామూలుగా లేవు
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా జరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 10 హామీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.
West Bengal Elections 2026
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. లక్ష్మీ భండార్ పథకం కింద మహిళలకు ఇచ్చే నెలసరి మొత్తాన్ని రూ.500 పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు.
ఆమె విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం, మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పడితే, బెంగాల్‌లోని సాధారణ వర్గానికి చెందిన మహిళలకు నెలకు ₹1,500 అందుతాయి. ప్రస్తుతం, బెంగాల్ ప్రభుత్వం సాధారణ వర్గానికి చెందిన మహిళలకు నెలకు ₹1,000 అందిస్తోంది.
ఎస్సీ/ఎస్టీ మహిళలకు నెలకు ₹1,700 అందనున్నాయి. ప్రస్తుతం, ఎస్సీ/ఎస్టీ మహిళలు ₹1,200 పొందుతున్నారు. నిరుద్యోగ యువతకు నెలకు ₹1,500 అందిస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రతి కుటుంబానికి శాశ్వత గృహాన్ని, కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన 10 హామీలు ఇవే..
1. లక్ష్మీ భండార్ పథకంలో పెంపుదల
సాధారణ మహిళలకు నెలకు ₹1500 (గతంలో ₹1000)
ఎస్సీ/ఎస్టీ మహిళలకు నెలకు ₹1700 (గతంలో ₹1200)
2. యువతకు ఆర్థిక సహాయం:
నిరుద్యోగ యువతకు నెలకు ₹1500 (సంవత్సరానికి ₹18,000)
3. వ్యవసాయ బడ్జెట్లో పెరుగుదల
₹30,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్
రైతులకు - భూమిలేని ప్రజలకు ఆర్థిక సహాయం
4. ప్రతి కుటుంబానికి ఒక పక్కా ఇల్లు
అందించడం ద్వారా అందరికీ గృహవసతి కల్పించడమే లక్ష్యం
5. ప్రతి ఇంటికి కుళాయి నీరు
అన్ని ఇళ్లకు శుభ్రమైన తాగునీటిని అందించడం
6. ఆరోగ్య సేవల విస్తరణ
ప్రతి బ్లాక్/పట్టణంలో సంవత్సరానికి రెండుసార్లు ఉచిత ఆరోగ్య శిబిరాలు
ఇంటింటికీ ఆరోగ్య సంరక్షణ
7. విద్యా వ్యవస్థలో మెరుగుదల
ప్రభుత్వ పాఠశాలల ఆధునిక మౌలిక సదుపాయాలు
విద్య నాణ్యతను మెరుగుపరచడం
8. బెంగాల్‌ను వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడం
లాజిస్టిక్స్, ఓడరేవులు, వాణిజ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి
ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని స్థాపించడం
9. వయోవృద్ధులకు పింఛను భద్రత
అర్హులైన వయోవృద్ధులందరికీ పింఛను విస్తరణ
10. కొత్త జిల్లాలు, పరిపాలనా సంస్కరణలు
7 కొత్త జిల్లాల ఏర్పాటు
పట్టణ సంస్థల విస్తరణ మరియు పరిపాలనా పునర్వ్యవస్థీకరణ
ప్రధానిపై విరుచుకు పడిన మమతా బెనర్జీ..
మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. "ఇక్కడ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన వారికి ఈ ప్రాంతం గురించి గానీ, రాష్ట్రం గురించి గానీ తెలియదు. వారికి రాష్ట్రం గురించి ఏమీ అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు తమ విధులను ఎలా నిర్వర్తించగలరు? రాష్ట్రపతి పాలన స్థానంలో అప్రకటిత రాష్ట్రపతి పాలన వచ్చింది. మోడీ.. బెంగాల్‌పై అసూయతోనే మీరు ఇక్కడ అప్రకటిత రాష్ట్రపతి పాలనలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీరు మొత్తం వ్యవస్థను పట్టాలు తప్పించారు." అంటూ విమర్సించారు.
"ఎన్నికల సమయంలో మనం ఎన్నో కుట్రలను చూస్తుంటాం, కానీ ఈసారి వాళ్ళు అన్ని హద్దులు దాటారు. ఈ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కానీ, మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు. ఎందుకంటే, ప్రజలకు బీజేపీ ప్రభుత్వం నచ్చడం లేదు. దీనికి కారణాలు ఎన్ఆర్సి, నియోజకవర్గాల పునర్విభజన." అంటూ మమతా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.




