West Bengal: పశ్చిమ బెంగాల్‌ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి!

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని తారాపీఠ్ ఆలయ పట్టణంలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఏడుగురు భక్తులు మృతి చెందారు.

Arun Chilukuri
Published on: 17 Aug 2026 11:08 AM IST
West Bengal
X

West Bengal: పశ్చిమ బెంగాల్‌ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి!  

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తారాపీఠ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక నాలుగు అంతస్తుల ప్రైవేట్ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య భక్తులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో హోటల్ మొదటి అంతస్తు రిసెప్షన్ ప్రాంతంలోని ఏసీ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చూస్తుండగానే దట్టమైన పొగ హోటల్ అంతటా వేగంగా వ్యాపించింది. ఊపిరాడక నిద్రలోనే కొందరు కన్నుమూయగా, మరికొందరు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాద సమయంలో ఫైర్ అలారం మోగకపోవడం ప్రమాద తీవ్రతను పెంచింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని వెంటనే రాంపూర్‌హాట్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

"ఒక్కసారిగా హోటల్ మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. బయటకు వెళ్లే మార్గం కనిపించక తీవ్ర భయాందోళనకు గురయ్యాం" అని కోల్‌కతాకు చెందిన ఓ మహిళా యాత్రికురాలు వివరించారు.

ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన, ఫైర్ అలారం ఎందుకు పనిచేయలేదనే అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story