Suvendu Adhikari: బెంగాల్ నూతన సీఎంగా ‘సువేందు అధికారి’?

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు అమిత్ షా ఆధ్వర్యంలో జరగనున్న బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో సువేందు అధికారి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. మే 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

Arun Chilukuri
Published on: 8 May 2026 3:43 PM IST
Suvendu Adhikari
X

Suvendu Adhikari: బెంగాల్ నూతన సీఎంగా ‘సువేందు అధికారి’?

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సందిగ్ధత వీడి, కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు నేడు (శుక్రవారం) సాయంత్రం తెరపడే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, బీజేపీ అధిష్టానం సీనియర్ నేత సువేందు అధికారి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ కేంద్ర పరిశీలకులుగా ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ లెజిస్లేటర్ పార్టీ (BJLP) సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ చర్చించి తమ శాసనసభా పక్ష నేతను (సీఎం) అధికారికంగా ఎన్నుకుంటారు. సువేందు అధికారితో పాటు దిలీప్ ఘోష్, శామిక్ భట్టాచార్య, అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ.. సువేందు వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గురువారం సాయంత్రం గవర్నర్ ఆర్‌.ఎన్. రవి రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.

శాసనసభా పక్ష నేత ఎన్నిక పూర్తయిన వెంటనే, బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, మే 9న (శనివారం) పశ్చిమ బెంగాల్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story