Marriage issues: సీఎంగారు మాకు పెళ్లిళ్లు కావడం లేదు ..వధువుల పథకాన్ని తీసుకురండి..!

Marriage issues: గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల యువకులకు పెళ్లి కావడం గగనంగా మారుతున్న వైనం.

Gagan kumar
Published on: 8 Oct 2026 3:06 PM IST
Marriage issues
X

Marriage issues: సీఎంగారు మాకు పెళ్లిళ్లు కావడం లేదు ..వధువుల పథకాన్ని తీసుకురండి..!

Farmers marriage crisis: దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెముక అని మనం ఎన్నో గొప్ప మాటలు చెప్పుకుంటాం. కానీ, అదే రైతు కుటుంబాల్లోని యువకులకు నేడు పెళ్లి కావడం గగనంగా మారుతోంది. గ్రామాల్లో సొంత పొలాలు, ఇళ్లు ఉండి వ్యవసాయం చేసుకుంటున్నా... కేవలం రైతు కుటుంబం అనే ఒకే ఒక్క కారణంతో యువకులకు వధువులు దొరకని పరిస్థితి ఏర్పడింది.

ఫలితంగా 35 ఏళ్లు దాటినా పెళ్లి కాక ఎంతోమంది యువకులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఈ తీవ్రమైన సామాజిక సమస్యపై కర్ణాటకకు చెందిన ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ వేదికపైనే తన ఆవేదనను వెళ్లబోసుకున్న వైనం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కర్ణాటకలోని మైసూర్ జిల్లా పిరియాపట్నంలో ఇటీవల జరిగిన ప్రజా సేవ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ సాధారణ యువకుడు సీఎం డి.కె. శివకుమార్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు, ముఖ్యంగా రైతు కుటుంబాలవారికి వధువులను వెతకడంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆ యువకుడు కోరాడు. తొలుత ఈ విజ్ఞప్తిని విన్న నాయకులు ఆశ్చర్యపోయి ఏంటి..? ఏమైంది..? అని ఆరా తీశారు. దీంతో ఆ యువకుడు సమస్య తీవ్రతను కళ్లకు కట్టినట్లు వివరించాడు.

సొంత భూములు, ఇళ్లు ఉండి వ్యవసాయం చేస్తున్నప్పటికీ మాకు పెళ్లిళ్లు కావడం లేదు. వ్యవసాయం చేసే కుటుంబాల్లోని అబ్బాయిలకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులు ఎవరూ సిద్ధంగా లేరు అని ఆవేదన వ్యక్తం చేశాడు. 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువకులు పెళ్లిళ్లు కాక తీవ్ర నిరాశలో కూరుకుపోయి, చివరికి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని వాపోయాడు.

దయచేసి యువ రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపండి అని సీఎంను అభ్యర్థించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాల మాదిరిగానే, పెళ్లి కాని యువ రైతుల సమస్యను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలని వేడుకున్నాడు.

నేడు చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు వ్యవసాయాన్ని ఒక ఉపాడిగా, గౌరవప్రదమైన జీవన విధానంగా చూడలేకపోతున్నారు. ఐటీ ఉద్యోగాలు, సిటీల్లో అపార్ట్‌మెంట్లు ఉన్న వారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండటంతో... పచ్చని పంటలను పండించి నలుగురి ఆకలి తీర్చే అన్నదాతల కుటుంబాలు పెళ్లి సంబంధాల విషయంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి.

ఒకరిద్దరితో మొదలైన ఈ సమస్య నేడు పల్లెటూర్లలో వేలాది మంది యువకుల జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. అన్నదాతల కష్టాలను తీర్చాల్సిన సమాజం, కనీసం వారి కుటుంబాల మనుగడ గురించి కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.