Extra Marital Affair: మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్..ఇంకెన్ని దారుణాలు చూడాలో!

Extra Marital Affair: మందులకని వెళ్లిన భర్త కాలువలో శవమై తేలాడు.

Naresh.k
Published on: 6 July 2026 11:33 AM IST
Extra Marital Affair
X

Extra Marital Affair: మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్..ఇంకెన్ని దారుణాలు చూడాలో!

Wife Kills Husband: మందులు తీసుకురావడానికి బయటకు వెళ్లిన కొడుకు శవమై తేలడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మొదట అదృశ్యం.. ఆ తర్వాత ప్రమాదం అనుకున్న కేసులో.. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లయినా అక్రమ సంబంధాన్ని వదులుకోని ఓ భార్య, తన ప్రేమకు అడ్డంగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా అంతమొందించిన సంచలన ఘటన వెలుగు చూసింది.

జార్తల్ గ్రామానికి చెందిన మోనూ అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం తన్ను అనే యువతితో వివాహం జరిగింది. వీరిద్దరూ జర్తల్ గ్రామంలోనే కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. జూన్ 8వ తేదీ రాత్రి మోనూ మందులు కొనడానికి తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బయటకు వెళ్లాడు. కానీ ఎంత సమయం గడిచినా అతను తిరిగి ఇంటికి రాలేదు.

కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. రెండు రోజుల తర్వాత, జూన్ 10న గ్రామ సమీపంలోని అసల్వాస్ కాలువలో మోనూ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. కాలువ గట్టునే అతని స్కూటీ కూడా పడి ఉంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడి చనిపోయి ఉంటాడని పోలీసులు తొలుత భావించి ప్రమాద నివారణ చట్టం కింద పోస్ట్‌మార్టానికి తరలించారు.

మోనూ మరణం కేవలం ప్రమాదం కాదని, అతని మృతిపై తమకు బలమైన అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు రూట్ మార్చారు. మోనూ, అతని భార్య తన్ను ఫోన్ కాల్ డేటా , టెక్నికల్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తన్నుకు మోనూతో పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు సోను అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె ప్రియుడితో గుట్టుగా సంబంధాన్ని కొనసాగించింది. తమ సుఖానికి భర్త అడ్డంగా ఉన్నాడని భావించిన తన్ను.. అతన్ని శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు సోనుతో కలిసి స్కెచ్ వేసింది.

జూన్ 8 రాత్రి ప్లాన్ ప్రకారం తన్ను ఫోన్ చేసి మోనూను కసోలి గ్రామానికి రప్పించింది. అప్పటికే అక్కడ ప్రియుడు సోను, అతని స్నేహితులు హరిఓం, అమన్ సిద్ధంగా కాచుకొని ఉన్నారు. మోనూ అక్కడికి చేరుకోగానే నలుగురు కలిసి ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా దాడి చేయడంతో మోనూ స్పృహ తప్పి పడిపోయాడు. మోనూ చనిపోయాడని భావించి, దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతన్ని, అతని స్కూటర్‌ను సమీపంలోని అసల్వాస్ కాలువ వద్ద పడేసి అక్కడి నుంచి పారిపోయారు.

పోలీసుల వేటలో భార్య తన్ను పాపం పండిపోయింది. నిందితుల గుట్టు రట్టు చేసిన పోలీసులు.. భార్య తన్నుతో పాటు ఆమెకు సహకరించిన హరిఓం అనే యువకుడిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ప్రియుడు సోను, మరో నిందితుడు అమన్ కోసం పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, నమ్మి నూరేళ్ల జీవితాన్ని పంచుకున్న భర్తను కాలయముడిలా మారి కాటేసిన భార్య ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story