కోర్టు ప్రాంగణంలోనే మహిళపై భర్త దాడి.. పోలీసుల సమక్షంలోనే భీకర ఘర్షణ!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజాగంజ్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో పోలీసుల సమక్షంలోనే మహిళపై భర్త దాడి చేశాడు. భరణం కేసు విచారణకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కోర్టు ప్రాంగణంలోనే మహిళపై భర్త దాడి.. పోలీసుల సమక్షంలోనే భీకర ఘర్షణ!
పోలీసులు, లాయర్లు చూస్తుండగానే కోర్టు ప్రాంగణంలో ఓ మహిళపై భర్త దాడి చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. భరణం కేసు విచారణలో భాగంగా ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన మహిళపై ఆమె భర్త కుటుంబసభ్యులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజాగంజ్పురంధర్పుర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళ.. భర్తతో విభేదాల కారణంగా అతడిపై, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత భరణం కోరుతూ స్థానిక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆమె తన తండ్రి, సోదరితో కలిసి శనివారం కోర్టుకు హాజరయ్యారు.
కోర్టులో విచారణ ముగిసిన తర్వాత బయటికి వస్తున్న సమయంలో.. ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి ఆమెపై దాడికి దిగారు. కిందపడేసి గొంతునులిమినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను కాపాడేందుకు వచ్చిన తండ్రి, సోదరిపై కూడా నిందితులు విచక్షణారహితంగా దాడి చేశారని వాపోయింది. కోర్టు కేసు కొనసాగిస్తే ప్రాణాలతో ఉండరంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది.
ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై జోక్యం చేసుకున్నారు. నిందితులను అక్కడి నుంచి పంపించి వేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితురాలు ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనపై స్పందించిన మహారాజాగంజ్ పోలీసులు.. నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.




