Sleeping: హాయిగా నిద్రపోయింది..రూ. 12 లక్షల అవార్డు గెలుచుకుంది.. ఎక్కడో తెలుసా?
Sleeping: జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన వినూత్న 'మ్యాట్ రేస్' నిద్ర పోటీ వివరాలు.
Sleeping: హాయిగా నిద్రపోయింది..రూ. 12 లక్షల అవార్డు గెలుచుకుంది.. ఎక్కడో తెలుసా?
Sleeping Contest: ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో రాత్రి నిద్రపోవడానికి కూడా సరిగ్గా సమయం దొరకని రోజులివి. ఉద్యోగ ఒత్తిళ్లు, టెన్షన్లతో చాలామందికి నిద్రలేమి ప్రధాన సమస్యగా మారింది. ఇలాంటి బిజీ ప్రపంచంలో... ఎలాంటి శ్రమ లేకుండా హాయిగా నిద్రపోతేనే లక్షలాది రూపాయల క్యాష్ ప్రైజ్ వస్తుంది అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు, కానీ ఇది నిజం. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఓ వినూత్న పోటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది.
ప్రముఖ పరుపుల తయారీ సంస్థ 'కోలా స్లీప్ జపాన్' ఆధ్వర్యంలో మ్యాట్ రేస్ పేరుతో ఓ సరికొత్త పోటీని నిర్వహించారు. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అలాగే నాణ్యమైన నిద్ర ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. కేవలం నిద్రపోవడం ద్వారా బహుమతులు గెలుచుకునే ఈ విచిత్ర పోటీలో పాల్గొనేందుకు వందలాది మంది ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు.
వేదికపై పోటీదారులందరికీ ప్రత్యేకమైన పరుపులను ఏర్పాటు చేసి సరిగ్గా 90 నిమిషాల సమయం ఇచ్చారు. పాల్గొన్న ప్రతి ఒక్కరి శరీరానికి అత్యాధునిక స్లీప్ ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. వారి హృదయ స్పందనలు, మెదడు తరంగాల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ... ఎవరు అత్యంత వేగంగా, ప్రశాంతంగా గాఢ నిద్రలోకి జారుకున్నారనే దానిని అంచనా వేశారు.
ఈ కఠినమైన పరిశీలనలో ఏమాత్రం టెన్షన్ పడకుండా, ఇట్టే గాఢనిద్రలోకి వెళ్లిపోయిన సుయిమీ అనే యువతి విజేతగా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు ఏకంగా రూ. 12 లక్షలు భారీ నగదు బహుమతిని అందజేశారు. శ్రమించి సంపాదించడం అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇలా హాయిగా కళ్లు మూసుకుని నిద్రపోయి లక్షలు సంపాదించవచ్చని నిరూపించిన ఈ ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది. ఏదేమైనా, ఈ సరికొత్త వార్త చదివిన చాలామంది నెటిజన్లు మాకూ ఇలాంటి పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తే బాగుండు అంటూ సరదాగా కామెంట్లు చేస్తుండటం విశేషం.




