Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు తేల్చబోయేది ఎవరు? సాయంత్రం 4 గంటల ఓటింగ్‌పై ఉత్కంఠ
Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు పార్లమెంటులో కీలక ఓటింగ్ జరుగనుంది. బీజేపీ వద్ద 240 సీట్లు ఉండగా, బిల్లు పాస్ కావాలంటే 360 ఓట్లు కావాలి. మోదీ సేన మేజిక్ చేస్తుందో లేదో చూడాలి.
Women's Reservation Bill
Women's Reservation Bill : భారత పార్లమెంటు వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ సంగ్రామం మొదలైంది. దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లుపై నేడు సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో కీలక ఓటింగ్ జరగనుంది. మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్), ఎన్నికల సంస్కరణల వంటి అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండో రోజు వాతావరణం వేడెక్కింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026ను, డిలిమిటేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును సభ ముందుంచారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం వారి హక్కు అని, ఇది ఎవరి పైన చేస్తున్న దయ కాదని ప్రధాని మోదీ కుండబద్ధలు కొట్టారు. అయితే, ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వం దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుల గణన అంశాన్ని లేవనెత్తగా, జనాభా లెక్కల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, కులాల వారీగా కూడా లెక్కింపు జరుగుతుందని అమిత్ షా సమాధానమిచ్చారు. సుమారు 18 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చల తర్వాత బిల్లు భవితవ్యం ఇప్పుడు ఓటింగ్ పై ఆధారపడి ఉంది.
రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే లోక్‌సభలో హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ (కనీసం 360 ఓట్లు) అవసరం. ప్రస్తుతం ఎన్డీయే కూటమి బలం 293 మాత్రమే. ఇందులో బీజేపీకి 240 స్థానాలు ఉండగా, మిత్రపక్షాలవి 53 ఉన్నాయి. అంటే మేజిక్ ఫిగర్ 360 కి మరో 67 ఓట్లు అవసరం. విపక్ష ఇండియా కూటమి బలం 241 వద్ద ఉంది. అంటే విపక్షాలు ఏకమైతే బిల్లును అడ్డుకునే అవకాశం ఉంది. ఏడుగురు స్వతంత్ర సభ్యుల నిర్ణయం కూడా ఇక్కడ కీలకం కానుంది.
కేవలం పార్లమెంటులో బిల్లు పాస్ అయితే సరిపోదు, దీనికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా కావాలి. ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలకు భరోసా ఇస్తున్నప్పటికీ, డిలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్న నిబంధన ఇప్పుడు చర్చనీయాంశమైంది. 16 ఏప్రిల్ న ప్రవేశపెట్టిన ఈ మూడు బిల్లులు భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.




