World breastfeeding week: ప్రపంచ తల్లిపాల వారోత్సవం వేళ‌.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.

World breastfeeding week: ప్రపంచ తల్లిపాల వారోత్సవం (ఆగస్టు 1 నుంచి 7 వరకు) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Mokshith
Updated on: 2 Aug 2026 12:21 PM IST
World breastfeeding week
X

World breastfeeding week: ప్రపంచ తల్లిపాల వారోత్సవం వేళ‌.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.

World breastfeeding week: ప్రపంచ తల్లిపాల వారోత్సవం (ఆగస్టు 1 నుంచి 7 వరకు) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి చేరవేసి, శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

ప్రతి చిన్నారికి తల్లిపాలు తొలి హక్కు

తల్లిపాలు ప్రతి శిశువుకు సహజసిద్ధమైన, సంపూర్ణ పోషకాహారమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే తొలి పాలు (కొలస్ట్రం) శిశువుకు తొలి టీకాలా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని ఆమె వివరించారు.

పుట్టిన గంటలోపే తల్లిపాలు.. తొలి ఆరు నెలలు తల్లిపాలే

ప్రతి తల్లి ప్రసవం జరిగిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. పుట్టిన తర్వాత తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే ఆహారం లేదా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆరు నెలల తర్వాత వయస్సుకు తగిన అనుబంధ ఆహారం ప్రారంభించినప్పటికీ, రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్యమంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన సమావేశాలు, ఇంటింటి ప్రచారం, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తల్లిపాలపై ప్రతి కుటుంబానికి సరైన సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఆస్పత్రుల్లో గర్భిణులు, కొత్త తల్లులకు ప్రత్యేక కౌన్సెలింగ్

అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది కలిసి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించాలని మంత్రి ఆదేశించారు. గర్భిణులు, కొత్తగా ప్రసవించిన తల్లులు, ఆరు నెలల లోపు శిశువుల తల్లులు, రెండేళ్లలోపు పిల్లల తల్లులకు తల్లిపాల ప్రయోజనాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని సూచించారు. కుటుంబ సభ్యులను కూడా కౌన్సెలింగ్‌లో భాగస్వామ్యం చేసి తల్లులకు అవసరమైన సహకారం అందేలా చూడాలని చెప్పారు.

పోషకాహార లోపం లేని తెలంగాణే లక్ష్యం

తల్లిపాలపై ఉన్న అపోహలను శాస్త్రీయంగా నివృత్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ప్రతి శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు అందేలా ఆస్పత్రులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు తల్లి, శిశు ఆరోగ్యానికి మార్గదర్శక కేంద్రాలుగా పనిచేయాలని పేర్కొన్నారు. పోషకాహార లోపం లేని తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రజాప్రతినిధులు, వైద్యులు, మహిళా సంఘాలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story