Horrific Accident: ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన స్లీపర్ బస్సు.. 9 మంది సజీవ దహనం

Horrific Accident: ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

CR Reddy
Published on: 24 Sept 2026 8:33 AM IST
Horrific Accident
X

Horrific Accident

Horrific Accident: ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నోయిడా నుంచి మహోబా వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ ఏసీ బస్సులో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌కల్పన ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు క్షణాల వ్యవధిలో అగ్నిగోళంగా మారింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటనతో ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

అర్ధరాత్రి సమయంలో భయానక ఘటన

జెవార్ కోవాలి పోలీసు స్టేషన్ పరిధిలోని దయాన్‌పూర్ గ్రామం సమీపంలో బుధవారం రాత్రి సుమారు 12:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు నడుస్తుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో మొత్తం 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులోపల దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల నుంచి కిందకు దూకేశారు.

ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు

ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక మహిళా ప్రయాణికురాలు తన అనుభవాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. తాను నిద్రపోతున్న సమయంలో ఎవరో తలుపు తట్టడంతో మెలకువ వచ్చిందని, అప్పటికే నలువైపులా దట్టమైన పొగ, భయానక వాతావరణం నెలకొందని తెలిపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బూట్లు కూడా వేసుకోకుండా కేవలం ఫోన్ పట్టుకుని బయటకు పరుగులు తీసినట్లు చెప్పారు. మరో ప్రయాణికుడు మాట్లాడుతూ... బస్సులోపల విపరీతమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడక జనం తీవ్ర ఇబ్బంది పడ్డారని, తోపులాట మధ్య ఎట్టకేలకు బయటపడగలిగామని కన్నీరుమున్నీరయ్యారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని సుమారు 45 నిమిషాలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సులో మంటలు చెలరేగడానికి అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.