Yogi Adityanath: అమ్మ ప్రేమకు సాటి ఏదీ లేదు.. తల్లి ముందు భిక్ష అడిగిన రోజును గుర్తుచేసుకున్న యోగి!

Yogi Adityanath: ఇటీవల కన్నుమూసిన తన తల్లి సావిత్రీ దేవిని తలుచుకుంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘యోగి కీ పాటీ’ పేరుతో భావోద్వేగ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 23 Nov 2026 11:18 AM IST
Yogi Adityanath
X

Yogi Adityanath: అమ్మ ప్రేమకు సాటి ఏదీ లేదు.. తల్లి ముందు భిక్ష అడిగిన రోజును గుర్తుచేసుకున్న యోగి!

Yogi Adityanath: సన్యాసం స్వీకరించిన తర్వాత తొలిసారి తన తల్లి ఎదుట నిలబడి భిక్ష అడిగిన భావోద్వేగ క్షణాలను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేసుకున్నారు. ఇటీవల కన్నుమూసిన తన మాతృమూర్తి సావిత్రీ దేవి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో ‘యోగి కీ పాటీ’ పేరుతో ఒక భావోద్వేగపూరిత లేఖను పంచుకున్నారు. తల్లి ప్రేమకు ప్రపంచంలో ఏదీ సరితూగదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

సన్యాసం స్వీకరించిన మూడేళ్ల తర్వాత ఉత్తరాఖండ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లిన సందర్భాన్ని యోగి ఆదిత్యనాథ్ తన లేఖలో వివరించారు. కాషాయ వస్త్రధారణలో ఇంటి ముందు నిలబడి భిక్ష అడగగా, ఆ గొంతు విని బయటకు వచ్చిన తన తల్లి సావిత్రీ దేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నమ్మలేకపోయారని తెలిపారు. ఆ సమయంలో తాను ‘‘అమ్మా.. నాకు భిక్ష పెట్టు’’ అని అడిగినట్లు పేర్కొన్నారు.

దీనికి ఆమె ఆవేదనతో.. ‘‘ఎందుకు సన్యాసం తీసుకున్నావు? ఇంట్లో ఏమైనా లోటు ఉందా?’’ అని ప్రశ్నించారని యోగి గుర్తుచేసుకున్నారు. అందుకు తాను బదులిస్తూ.. ‘‘అమ్మా.. సన్యాసం నా ధర్మం. ఒక యోగి ఆకలి భిక్షతోనే తీరుతుంది. నేను ఇక్కడ ఉండటానికి రాలేదు, కేవలం భిక్ష అడగడానికి మాత్రమే వచ్చాను’’ అని చెప్పినట్లు లేఖలో రాసుకొచ్చారు. చివరకు తన నిర్ణయాన్ని తల్లి గౌరవించి, భిక్ష వేసి ఆశీర్వదించారని తెలిపారు.

తల్లి గొప్పతనాన్ని వివరిస్తూ శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయంలో తల్లి కౌసల్య ఆశీర్వదించిన ఘట్టాన్ని, అలాగే శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలను యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. "అమ్మ అందరి స్థానాన్ని భర్తీ చేయగలదు కానీ, అమ్మ స్థానాన్ని మాత్రం మరెవరూ భర్తీ చేయలేరు" అని ఆయన కొనియాడారు. తనకు అక్షర జ్ఞానం నేర్పిన తొలి గురువు తల్లేనని, జీవితంలో కొన్ని రుణాలను ఎప్పటికీ తీర్చుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లుల రుణం తీర్చుకోలేకపోయినా, సమాజంలోని మహిళలు, తల్లుల పట్ల మన బాధ్యతలను నెరవేర్చగలమని యోగి పేర్కొన్నారు. అనాథలుగా, నిరాశ్రయులుగా మిగిలిన తల్లులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, కష్టాల్లో ఉన్న మహిళల బాధలను అర్థం చేసుకొని వారికి తోడుగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీ దేవి ఈ నెల 20న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.