సైనికులకు యోగి సర్కార్ భారీ గిఫ్ట్.. భత్యాలు డబుల్, ఇంటి కొనుగోలుపైనా రాయితీ
Yogi Adityanath: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే సైనికులు, మాజీ సైనికులు , అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
సైనికులకు యోగి సర్కార్ భారీ గిఫ్ట్.. భత్యాలు డబుల్, ఇంటి కొనుగోలుపైనా రాయితీ
Yogi Adityanath: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే సైనికులు, మాజీ సైనికులు , అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడు సంచలన ప్రకటనలు చేశారు. విప్లవ గడ్డ మీరట్ వేదికగా జరిగిన మాజీ సైనికుల సదస్సులో పాల్గొన్న సీఎం యోగి.. శౌర్య పతక విజేతలకు ఇచ్చే ఏకమొత్తం, వార్షిక భత్యాలను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు ఇళ్ల కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు పరిమితి పెంపు, అమరవీరుల కుటుంబ సభ్యులకు సొంత ఊరికి సమీపంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పరమ వీర చక్ర నుంచి యుద్ధ సేవా పతకం వరకు.. భత్యాలన్నీ డబుల్
రాష్ట్రంలోని శౌర్య పతక విజేతలకు ప్రస్తుతం అందిస్తున్న నగదు ప్రోత్సాహకాలను యోగి ప్రభుత్వం ఏకంగా రెట్టింపు చేస్తోంది. పరమ వీర చక్ర విజేతలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 52 లక్షల ఏకమొత్తం, రూ. 3.12 లక్షల వార్షిక భత్యం ఇకపై రెట్టింపు కానుంది. అదేవిధంగా మహావీర్ చక్ర (రూ. 31 లక్షల ఏకమొత్తం, రూ. 2.37 లక్షల వార్షిక భత్యం), వీర్ చక్ర (రూ. 20.8 లక్షల ఏకమొత్తం, రూ. 1.37 లక్షల వార్షిక భత్యం), అశోక చక్ర (రూ. 32.5 లక్షల ఏకమొత్తం, రూ. 1.50 లక్షల వార్షిక భత్యం), కీర్తి చక్ర (రూ. 19.5 లక్షల ఏకమొత్తం, రూ. 1.30 లక్షల వార్షిక భత్యం) విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా రెట్టింపు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
వీటితో పాటు శౌర్య చక్ర (రూ. 13 లక్షలు), సేనా , వాయు సేనా పతకాలు (రూ. 10 లక్షలు), సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకం (రూ. 3.12 లక్షలు), ఉత్తమ్ యుద్ధ సేవా పతకం (రూ. 2.60 లక్షలు), యుద్ధ సేవా పతకం (రూ. 83,200), మెన్షన్ ఇన్ డిస్పాచ్ (రూ. 52,000) అవార్డు గ్రహీతలకు అందజేస్తున్న ఏకమొత్తం , వార్షిక చెల్లింపులన్నింటినీ రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు.
స్టాంప్ డ్యూటీ మినహాయింపు పెంపు.. ఇంటి వద్దే ఉద్యోగం
సైనికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ మరో రెండు ముఖ్యమైన నిర్ణయాలను సీఎం యోగి తీసుకున్నారు. మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబ సభ్యులు గృహ కొనుగోళ్లు జరిపినప్పుడు ఇచ్చే స్టాంప్ డ్యూటీ మినహాయింపు పరిమితిని రూ. 20 లక్షల నుంచి ఏకంగా రూ. 50 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబ సభ్యులు ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడకుండా.. వారికి వారి సొంత జిల్లాలో లేదా సమీప జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
సైనికుడు ఎన్నటికీ రిటైర్ కాడు: సీఎం యోగి
ఈ సందర్భంగా సైనికుల త్యాగాలను సీఎం యోగి కొనియాడారు. సురక్షితమైన వాతావరణం ఉన్నప్పుడే ఏ దేశమైనా, సమాజమైనా అభివృద్ధి పథంలో నడవగలదని అన్నారు. సియాచిన్ మంచు శిఖరాల నుంచి ఎడారిలోని మండే ఇసుక వరకు, సముద్ర గర్భం నుంచి ప్రకృతి విపత్తుల వరకు సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు. ఒక సైనికుడు తన విధుల నుంచి పదవీ విరమణ పొందినప్పటికీ, అతనిలోని దేశభక్తి, సేవా సంకల్పం ఎన్నటికీ రిటైర్ కావని.. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారు సమాజానికి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తారని సీఎం యోగి పేర్కొన్నారు.




