Yusuf Pathan: మమతా బెనర్జీ కోసం సీటు త్యాగం?.. క్లారిటీ ఇచ్చిన మాజీ క్రికెటర్!

Yusuf Pathan: మమతా బెనర్జీ కోసం తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ స్పందించారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 11:06 AM IST
Yusuf Pathan
X

Yusuf Pathan: మమతా బెనర్జీ కోసం సీటు త్యాగం?.. క్లారిటీ ఇచ్చిన మాజీ క్రికెటర్!

Yusuf Pathan: తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తలను మాజీ క్రికెటర్, బహరాంపూర్ లోక్‌సభ ఎంపీ యూసఫ్ పఠాన్ తీవ్రంగా ఖండించారు. పార్టీ నేతలు ఎవరూ తనను రాజీనామా చేయమని కోరలేదని ఆయన శనివారం స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ మీడియాలో వస్తున్న కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎంపీగా ఎన్నికవ్వాలని భావిస్తున్నట్లు ఇటీవల స్థానిక మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అందుకోసం బహరాంపూర్ ఎంపీగా ఉన్న యూసఫ్ పఠాన్‌తో రాజీనామా చేయించి.. ఆ తర్వాత వచ్చే ఉపఎన్నికల్లో మమత పోటీ చేసేలా వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా, మమతా బెనర్జీ తరఫున టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. యూసఫ్ పఠాన్‌తో సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు రావడంతో రాజకీయంగా పెద్ద కలకలం రేగింది.

ఈ వదంతులపై సౌరవ్ గంగూలీ సైతం తీవ్రంగా స్పందించారు. ఆ కథనాల్లో అసలేమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. "కేవలం వదంతుల ఆధారంగా ఇలాంటి కథనాలను ప్రచురించవద్దు. వార్తలు రాసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి" అని మీడియాకు హితవు పలికారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ వివాదానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు యూసఫ్ పఠాన్ స్వయంగా రంగంలోకి దిగారు. "రాజీనామా అంశాన్ని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నా వద్ద ఎప్పుడూ ప్రస్తావించలేదు. మా మధ్య జరిగిన చివరి సమావేశంలో కూడా దీనిపై ఎలాంటి చర్చ రాలేదు. ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోయినా మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారం జరగడం విచారకరం" అని యూసఫ్ పఠాన్ ఆవేదన వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story