కుక్కల బెడద పట్టించుకోలేదంటూ.. అధికారుల బల్లపైనే శునకాలను వదిలిన యువసేన!
మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో వీధి కుక్కల బెడదపై యువసేన వినూత్న నిరసన. ఆఫీసర్ టేబుల్‌పై కుక్కలను వదిలిన కార్యకర్తలు, వైరల్ వీడియో.
కుక్కల బెడద పట్టించుకోలేదంటూ.. అధికారుల బల్లపైనే శునకాలను వదిలిన యువసేన!
వీధి కుక్కల బెడదపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ యువసేన కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా సంచుల్లో రెండు వీధి శునకాలను తీసుకొచ్చి నగర పంచాయతీ కార్యాలయంలోని ప్రధానాధికారి బల్లపై వదిలేశారు. దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని నిఫాడ్ నగర పంచాయతీ కార్యాలయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా యువసేన కార్యకర్తలు మాట్లాడుతూ.. నిఫాడ్‌లో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే కుక్కలు పలువురిపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యపై గత ఆరు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ప్రజలు పడుతున్న కష్టాలు అధికారులకు ప్రత్యక్షంగా తెలియాలనే తాము ఈ వినూత్న నిరసనకు దిగినట్లు స్పష్టం చేశారు.
యువసేన ఆందోళనతో స్పందించిన అధికారులు.. సమస్య పరిష్కారానికి 8 రోజులు గడువు కోరారు. ఒకవేళ అప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే శునకాలను మళ్లీ కార్యాలయానికి తీసుకువస్తామని కార్యకర్తలు హెచ్చరించారు.




