Marripadu: మర్రిపాడులో 104 సేవలు.. గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహణ
Marripadu: మర్రిపాడులో 104 వాహనం ద్వారా వైద్య శిబిరం నిర్వహించారు. గర్భిణులు, వృద్ధులకు పరీక్షలు చేసి ఉచిత మందులు అందించారు.
Marripadu
Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 మొబైల్ వైద్య వాహనం ద్వారా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అద్దంకి గోపినాథ్ ఆధ్వర్యంలో, హెచ్‌ఎంఈ తిరుపతమ్మ సిబ్బందితో కలిసి ఇసుకపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్ ద్రావణం సేవించడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను వివరించారు.
అత్యవసర పరిస్థితులు తప్ప ఎండలో బయటికి వెళ్లకూడదని, వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ స్వప్న, ఏఎన్ఎం దీనమ్మ, ఆశా వర్కర్లు, పైలెట్ ఎస్కే మస్తాన్, ఈఎంటీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.




