Nellore: రైతుల ఖాతాల్లోకి ‘అన్నదాత సుఖీభవ’ నిధులు మంత్రి ఆనం!
Nellore: రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధుల విడుదల.
Nellore: రైతుల ఖాతాల్లోకి ‘అన్నదాత సుఖీభవ’ నిధులు మంత్రి ఆనం!
నెల్లూరు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి సంక్షేమానికి అగ్రతాంబూలం వేస్తూ ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లను జమ చేసిన కార్యక్రమాన్ని రైతులతో కలిసి వీక్షించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ రెండో ఏడాది తొలి విడత నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన *"నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం"*కు నిదర్శనమని పేర్కొన్న మంత్రి, ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ రాబోయే మూడేళ్లలో సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ విడతలో ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.5,000, పీఎం కిసాన్ కింద రూ.2,000 చొప్పున మొత్తం రూ.7,000 జమ అయ్యిందన్నారు. నెల్లూరు జిల్లాలో 1,77,545 మంది రైతులకు రూ.117.16 కోట్లు, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 34,223 మంది రైతులకు రూ.22.84 కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు.సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు ఆదాయాన్ని పెంపొందించుకోవాలని అంతర్ పంటల వైపు మొగ్గు చూపాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, వరిపై అధిక ఆధారపడకుండా ఉద్యానవన, వాణిజ్య పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. అంతర పంటల విధానాన్ని అవలంబించడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని చెప్పారు.అగరు వుడ్ వంటి వాణిజ్య పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి ఈ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.
మన భవిష్యత్ తరాలకు నాణ్యమైన ఆహారం అందించేలా, అందరికీ ఆరోగ్య భద్రత కలిగేలా రైతులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మెగా చెక్కును మంత్రి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.




