Nellore: గూడూరులో భారీ ఫర్నిచర్ సిటీ: రూ.3500 కోట్లతో మెగా క్లస్టర్!

Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండాగుంటలో 1000 ఎకరాల్లో రూ.3,500 కోట్ల వ్యయంతో మెగా ఫర్నిచర్ క్లస్టర్ రానుండగా, 70 వేల మందికి ఉపాధి లభించనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Oct 2026 11:19 AM IST
Nellore
X

Nellore: గూడూరులో భారీ ఫర్నిచర్ సిటీ: రూ.3500 కోట్లతో మెగా క్లస్టర్!

Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండగుంట ప్రాంతం పారిశ్రామికంగా మరో ముందడుగు వేయబోతోంది. గూడూరు మండలం కొండగుంట సమీపంలో ఏకంగా 1000 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి ఫర్నిచర్ మెగా క్లస్టర్ రాబోతోంది. దాదాపు 3500 కోట్ల రూపాయల పెట్టుబడితో, 70 వేల మందికి ఉపాధి కల్పించేలా ఈ భారీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఫర్నిచర్ మెగా క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం దాదాపు 1000 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా - TPCI తో CII పార్టనర్ షిప్ సమ్మిట్ 2025 లో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఏడాది ఏప్రిల్ 13న TPCI అధికారులు గూడూరు మండలం కొండాగుంట దగ్గర ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.

స్థలం అన్ని విధాలా అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 28న తమ అంగీకారాన్ని తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టుకు మరింత వేగం ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వయంగా వెల్లడించారు.ఈ మెగా క్లస్టర్ మొత్తం పెట్టుబడి అక్షరాలా 3500 కోట్ల రూపాయలు.

ఇందులో TPCI సంస్థ 940 కోట్ల నుండి 1160 కోట్ల వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయనుంది. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, క్లస్టర్ నిర్వహణ వ్యవస్థలను TPCI చూసుకుంటుంది.మిగిలిన 2230 కోట్ల నుండి 2450 కోట్ల వరకు ప్రైవేట్ పెట్టుబడిదారులు ఫ్యాక్టరీలు, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడి పెట్టనున్నారు.

ఈ క్లస్టర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల నుండి 70 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇది నెల్లూరు జిల్లా యువతకు పెద్ద వరంగా మారనుంది.ఈ ఫర్నిచర్ సిటీని పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నారు. కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండటంతో విదేశాల నుండి ముడి కలప దిగుమతి, ఫర్నిచర్ తయారీ, ఎగుమతి సులభతరం కానుంది.

ఈ క్లస్టర్ లో 400 నుండి 550 వరకు ఫర్నిచర్ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. కలప ప్రాసెసింగ్ జోన్, ఫర్నిచర్ తయారీ యూనిట్లు, లాజిస్టిక్స్ సదుపాయాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్, షోరూమ్స్, నివాస సముదాయాలు అన్నీ ఇందులోనే ఉండనున్నాయి.ఈ క్లస్టర్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే ఏడాదికి 20 లక్షల ఫర్నిచర్ యూనిట్లు,

40 లక్షల ఫ్లాట్-ప్యాక్ కిట్లు, 15 లక్షల మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్ సెట్లు తయారు కానున్నాయి. దీని ద్వారా ఏడాదికి 8 వేల కోట్ల నుండి 10 వేల కోట్ల వరకు ఎగుమతులు జరుగుతాయని అంచనా.ప్రపంచ ప్రసిద్ధ ఫర్నిచర్ హబ్ లైన చైనాలోని ఫోషన్, వియత్నాంలోని బిన్ డువోంగ్, టర్కీలోని ఇజ్మీర్ తరహాలో గూడూరు ఫర్నిచర్ క్లస్టర్ ను అభివృద్ధి చేయనున్నారు.

గూడూరులో రాబోతున్న ఈ 1000 ఎకరాల ఫర్నిచర్ సిటీతో నెల్లూరు జిల్లా పారిశ్రామిక ముఖచిత్రం మారనుంది. స్థానికంగా భారీగా ఉద్యోగాలు రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఫర్నిచర్ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్