Atmakur: ప్రజల విశ్వాసంతోనే కూటమి విజయాలు
Atmakur: ఆత్మకూరులో స్థానిక ఎన్నికల విజయాలు ప్రజల విశ్వాస ఫలితమన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి; సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలు వెల్లడి.
Atmakur: ప్రజల విశ్వాసంతోనే కూటమి విజయాలు
ఆత్మకూరు: ప్రజలు తమపై ఉంచిన విశ్వాసం, కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే స్థానిక ఎన్నికల్లో విజయాలకు ప్రధాన కారణమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో విజయాలు సాధించామని తెలిపారు.సోమవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్థానిక మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం సంతోషకరమన్నారు. నియోజకవర్గ పరిధిలోని 135 గ్రామ పంచాయతీల్లో 41 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం, పోటీ జరిగిన ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపడం తమపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలతో పాటు ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయాలు సాధించారని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఏకాభిప్రాయంతో షకీలా గారిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, స్వతంత్ర కౌన్సిలర్లు సైతం ఆత్మకూరు అభివృద్ధికి సహకరిస్తామని ముందుకు రావడం సంతోషకరమన్నారు.
సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం.. మంత్రి ఆనం
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.సూపర్ సిక్స్ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, పేద కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం-2.0, స్త్రీశక్తి వంటి పథకాలతో వివిధ వర్గాలకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు.
రైతులకు పెట్టుబడి భరోసా కల్పించడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో అమలవుతున్నాయని వివరించారు.ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు పారదర్శకమైన పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు.
ఆత్మకూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. మంత్రి ఆనం
ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి వసతులు, పశువుల కోసం క్యాటిల్ షెడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టామని వివరించారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
ఆత్మకూరు పట్టణంలోనూ ఇప్పటికే కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిధులు తీసుకువచ్చి పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి, సెంట్రల్ డివైడర్, ఆధునిక లైటింగ్ వంటి పనులు చేపట్టామని చెప్పారు.ఆత్మకూరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే విధంగా భారీ ఐకానిక్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు నూతన రహదారుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని, డిసెంబర్ రెండో వారంలో ఈ అభివృద్ధి పనులను ప్రారంభించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు.
యువతకు ఉపాధి..గ్రామీణ ప్రాంతాలకు మౌలిక వసతులు..మంత్రి ఆనం
ఆత్మకూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన అవకాశాలను అన్వేషిస్తామని మంత్రి తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, సాగునీటి సదుపాయాలను మరింత మెరుగుపరచడం, విద్యా, వైద్య రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తమ ప్రాధాన్యతలని పేర్కొన్నారు.ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆత్మకూరులో ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాధాన్యత..మంత్రి ఆనం
రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధితో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు.ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు సహకారంతో ఆలయాల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని వెల్లడించారు.
రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించాం..మంత్రి ఆనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన విధానాల్లోనే ముందుకు వెళ్లామని, ప్రజల విశ్వాసాన్ని పొందడం ద్వారానే విజయాలు సాధించామని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి దౌర్జన్యాలకు, దాడులకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూశామని తెలిపారు.ఆత్మకూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరామని, పట్టణ అభివృద్ధి అనేది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదని, ప్రజలందరి బాధ్యత అని పేర్కొన్నారు.
రాబోయే రెండున్నర సంవత్సరాల్లో మరింత చురుగ్గా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఆత్మకూరు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తామని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.




