Atmakur: ప్రజాస్వామ్య విలువలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

Atmakur: ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటన. రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 18 Sept 2026 5:20 PM IST
Atmakur
X

Atmakur: ప్రజాస్వామ్య విలువలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి మండల పరిషత్ సభ్యులను అభినందిస్తూ, ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలకు అందించిన సేవలను ప్రశంసించారు.

ప్రజాస్వామ్యంలో పదవులు ఎవరికీ శాశ్వతం కావని మంత్రి స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన కాలపరిమితి పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ పదవుల నుంచి వైదొలగాల్సిందేనని అన్నారు. గతంలో తాము కూడా పదవీకాలం పూర్తయిన తర్వాత ఎలాంటి అసంతృప్తికి తావులేకుండా బాధ్యతల నుంచి వైదొలిగిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.రాజకీయం కంటే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ విధానమని మంత్రి తెలిపారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను రద్దు చేసి తమకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ, అటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య సంస్థలకు గౌరవం ఇవ్వడం, రాజ్యాంగ విలువలను కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.ఆత్మకూరు మండలంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి సమీక్షించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగును తగ్గించి మెట్ట పైర్లు, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సాగునీటి సంబంధిత సహకారం అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గంలో రహదారులు, వంతెనలు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఆత్మకూరు రూరల్ పరిధిలో నాలుగు లైన్ల బైపాస్ రహదారి పనులకు సుమారు రూ.6.50 కోట్ల నిధులు మంజూరు కాగా, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులతో కలిపి మొత్తం సుమారు రూ.9 కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు.నాగులుపాడు రోడ్డు జంక్షన్ నుంచి నరసాపురం మీదుగా వాసిలి రోడ్డు జంక్షన్‌ను కలిపే రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

సంగం మండలం వీర్లగుడిపాడు పరిధిలో బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.25 కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి రూ.2 కోట్ల చొప్పున అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం, ఇల్లు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో అర్హులకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో స్థలాలు కేటాయించినప్పటికీ నిర్మాణాలు చేపట్టకుండా వదిలేసిన స్థలాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, నూతన లేఅవుట్లలో అర్హులైన వారికి పార్టీలకతీతంగా ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, రహదారులు, సాగునీరు, గృహ నిర్మాణం తదితర అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రజలకు ఉపయోగపడే రహదారులు ఆక్రమణలకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రహదారుల సరిహద్దులను సర్వే చేసి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని తహశీల్దార్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య చివరి సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాలేదంటూ ప్రతిపక్ష నేతలు చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు.

స్థానిక సంస్థల సమావేశాలకు రాలేదని.. దానిని కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరయ్యే అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం కంటే ప్రజా సమస్యలపై చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.మైక్ దొరికింది కదా అని విజ్ఞత లేకుండా మాట్లాడటం రాజకీయ హుందాతనం కాదని మంత్రి అన్నారు.

రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు కాకుండా ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంలో ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని మంత్రి తెలిపారు. ప్రజల తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

పదవులు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ప్రజాసేవ, ప్రజల పట్ల బాధ్యత, రాజ్యాంగ విలువలు శాశ్వతంగా నిలవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టనున్న పనులపై పూర్తి వివరాలను త్వరలో మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.ఈ సమావేశంలో ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, డి ఎల్ డి వో వెంకట రమణయ్య, తాసిల్దార్ పద్మజ, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)