Atmakur: ఆత్మకూరులో 97 శాతం ముగిసిన పోలియో చుక్కల పంపిణీ
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో పల్స్ పోలియో విజయవంతం. 97 శాతం మంది చిన్నారులకు చుక్కల పంపిణీ. రేపు ఇంటింటికీ వెళ్లనున్న వైద్యాధికారులు.
Atmakur: ఆత్మకూరులో 97 శాతం ముగిసిన పోలియో చుక్కల పంపిణీ
ఆత్మకూరు: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మున్సిపల్ పరిధిలో మొత్తం 2,801 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉండగా, ఈరోజు ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లు మరియు ట్రాన్సిట్ బూత్‌ల ద్వారా 2,625 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.
దీంతో 97 శాతం లక్ష్యాన్ని విజయవంతంగా సాధించాము.మిగిలిన 3 శాతం మంది చిన్నారులకు రేపు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ బృందం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అంశుదర్ పలు పోలియో బూత్‌లను సందర్శించి కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు. వీరి వెంట హెచ్ ఈ ఓ ఎస్ సుధాకర్, హెచ్పి పార్వతి,హెల్త్ అసిస్టెంట్ జి రవీందర్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సాయి ప్రసన్న మరియు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ పలు పోలియో బూత్‌లను సందర్శించి, పెద్ద సంఖ్యలో పాల్గొని తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మిగిలిన చిన్నారులకు కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




