Nellore: వైసీపీ దీక్షల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు బీద రవిచంద్ర
Nellore: నల్ల రిబ్బన్లు, హైరర్స్ దుకాణాలకే తప్ప వైసీపీ నిరాహార దీక్షల వల్ల ఎవరికీ ఉపయోగం లేదంటూ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎద్దేవా.
Nellore: వైసీపీ దీక్షల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు బీద రవిచంద్ర
నెల్లూరు: బాధితులు లేని, డీఎస్సీ అభ్యర్థుల మద్దతు లేని నిరాహార దీక్షలను నిర్వహించడం వైసీపీకే చెల్లిందన్నారు శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
మెగా డీఎస్సీ పై ఇప్పటికే ప్రభుత్వ అధికారులు మూడుసార్లు వివరణ ఇచ్చారని, డీఎస్సీ అభ్యర్థుల మెరిట్, ఎంపిక జాబితాను ప్రభుత్వం వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచిందని చెప్పారు... వైసిపి నేతలు పదే పదే ప్రచారం చేస్తున్న అవాస్తవాలపై వివరణలతో కూడిన ఖండనలను ప్రభుత్వ అధికారులు ఇప్పటికే పలుమార్లు ఇచ్చారని, ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే సమాధానం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
టెట్ వ్రాయకపోయినా, క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని, వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని అన్నారు. క్రీడా సర్టిఫికేట్లను రాష్ట్ర కమిటీ పరిశీలించిందని, వాటిని జారీ చేసిన అసోసియేషన్, ఫెడరేషన్, యూనివర్సిటీల నుంచి ధ్రువీకరణ పొందిందని తెలిపారు.
మెగా డీఎస్సీ లో మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చామని, వర్టికల్, హారి జాంటల్ రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేశామని, కొందరు అభ్యర్థులకు మెరిట్ ఉన్నప్పటికీ, హారిజాంటల్ రిజర్వేషన్ కారణంగా ఇతర అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. అధికారులు ఈ విషయంపై అభ్యర్థులకు అవగాహన కల్పించారని అన్నారు.
గుడ్డ కాల్చి మొహాన వేస్తాం, బురద చల్లేస్తాం.... అన్న రీతిలో వైసిపి నేతల వ్యవహార శైలి ఉందని, ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి, తమవారితో చెప్పించి నిజం చేయాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, కాక్రోచ్ ఉద్యమాన్ని కాపీ చేయాలని ప్రయత్నించి, జగన్ నవ్వుల పాలు అవుతున్నారని అన్నారు. పదవ తరగతిలో ప్రశ్నాపత్రాలను కాపీ చేసిన జగన్ నేడు కాక్రోచ్ ఉద్యమాన్ని కాపీ చేస్తున్నారని చెప్పారు.
కొత్త డీఎస్సీలు ప్రకటించాలని, ఉద్యోగాల సంఖ్య పెంచాలని కోరుతూ... నిరాహార దీక్షలు చేపట్టడం సాధారణమేనని.... కానీ డిఎస్సి అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు, భవిష్యత్తులో డీఎస్సీలు రాకుండా అడ్డుకునేందుకు నిరాహార దీక్షలు చేయడం తొలిసారి చూస్తున్నామని అన్నారు.
మెగా డిఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15941 టీచర్ పోస్టుల భర్తీతో నిరుద్యోగుల కలలను నిజం చేసిన నారా లోకేష్ అక్టోబర్ నెలలో మరో మారు డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమవుతుండడంతో జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం రెండేళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడంతోపాటు 24 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు ఒప్పందాలు(MOU) చేసుకుందని చెప్పారు.
మెగా డీఎస్సీ ద్వారా 15941 టీచర్ పోస్టులను మరియు 6100 కానిస్టేబుల్, 411 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందని, 2026 ఉగాది నాడు 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి జాబ్ కేలండర్ ను విడుదల చేసిందని, గ్రూప్ 1,2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, జాబ్ మేళాలు నిర్వహించి 92,149 ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందని, 3619 కాంట్రాక్టు లెక్చరర్స్ సేవలను పునరుద్దరించిందని తెలిపారు.
MSME ద్వారా 248906 ఉపాధి అవకాశాలను, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64035 ఉద్యోగాలను, ఐటీ &ఎలక్ట్రానిక్ రంగంలో 13866 ఉద్యోగాలను, పర్యాటక రంగంలో 5028 ఉద్యోగాలను కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో 729 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం అని అన్నారు. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గ్రామ, సచివాలయం ఉద్యోగాలతో సరి పెట్టారని, వాలంటీర్ల పేరిట ఉద్యోగాల్ని సృష్టించి 5 వేల రూపాయల జీతంను ముష్టిగా వేసి ఉన్నత విద్యావంతుల్ని సైతం అప్రయోజకులుగా మార్చిందని అన్నారు.
గ్రాడ్యుయేట్స్ లో 24% నిరుద్యోగంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను ప్రధమ స్థానంలో నిలిపిన ఘనత వైసిపి ప్రభుత్వందే అని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక లో ఇది బట్టబయలు అయిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేక రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని NRC నివేదిక తెలిపిందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో IBM, HSBC వంటి సంస్థలు, అమర్ రాజా వంటి కంపెనీలు బలవంతంగా గెంటివేయబడ్డాయని, యువత పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని, గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యం వంటివి విచ్చలవిడిగా అందుబాటులో ఉండడంతో యువత భవిష్యత్తు ప్రశ్నర్థకమైందని గుర్తు చేశారు.




