Nellore: కాశీ యాత్ర బస్సు ప్రమాదంపై మేకపాటి విక్రమ్ రెడ్డి దిగ్భ్రాంతి
Nellore: బీహార్ బస్సు ప్రమాదంలో నెల్లూరు యాత్రికుల మృతిపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి దిగ్భ్రాంతి.
Nellore: కాశీ యాత్ర బస్సు ప్రమాదంపై మేకపాటి విక్రమ్ రెడ్డి దిగ్భ్రాంతి
Nellore: నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారత దేశ యాత్రలో భాగంగా కాశీకి బయల్దేరిన ప్రైవేట్ బస్సు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఓ మహిళ మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబాలకు ఈ కష్టకాలంలో ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను కోరారు. యాత్రకు వెళ్లిన మిగతా భక్తులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నెల 1వ తేదీన నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారత దేశ యాత్రకు బయల్దేరిన ప్రైవేట్ బస్సులో ఆత్మకూరు, సంగం, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన 43 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. గయా దర్శనం అనంతరం వారణాసికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.




