Nellore: నేడే ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన
Nellore: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Nellore: నేడే ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన
నెల్లూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కావలి నియోజకవర్గం పరిధిలో ఉన్న తుమ్మలపెంట, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేశారు. ముందుగా తుమ్మలపెంటలో ఏర్పాటుచేసిన ప్రజావేదిక కార్యక్రమంలో స్థానిక రైతులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఇటీవల కావలి నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో అక్కడ భూసేకరణ వేగవంతంగా జరుగుతోంది.
భూసేకరణ పై రైతులు పలు సమస్యలు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రజావేదిక నిర్వహిస్తూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజావేదిక ఏర్పాటు, స్థానిక పరిస్థితులను ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి తో కల్సి...రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. గత నాలుగు రోజులుగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆ ప్రాంతంలో పర్యటించారు. భద్రత ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించారు.
మంగళవారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు జువ్వలదిన్నె ప్రజావేదికకు చేరుకుంటారని సీఎం కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. తుమ్మలపెంటలో ప్రజావేదిక పూర్తికాగానే అక్కడ నుంచి మధ్యాహ్నం 12 తర్వాత బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల తో సమావేశం అవుతారు. అదే ప్రాంతంలో తెలుగుదేశం క్యాడర్ తోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరి వెళుతారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయ తలపెట్టిన మహానాడును ప్రధాని ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు నేపథ్యంలో రద్దు కావడం... కావలి నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేడర్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేడర్ సమావేశంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి.. ఎమ్మెల్సీ,పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర వర్గీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.




