Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు!

Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. సృష్టి, శ్రమకు ప్రతీక దేవశిల్పి అని పేర్కొన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.

A Praveen, Nellore
Published on: 17 Sept 2026 1:19 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు!

Nellore: సృష్టి, శ్రమ, సాంకేతిక నైపుణ్యానికి ప్రతీకగా దేవశిల్పి విశ్వకర్మను భావిస్తారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. గురువారం విశ్వకర్మ జయంతి సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మను దైవిక వాస్తుశిల్పి, శిల్పి, ఇంజనీర్‌గా భావిస్తారని తెలిపారు. శిల్పకళ, వాస్తుశాస్త్రం, నిర్మాణ రంగం, యంత్ర నిర్మాణం, సాంకేతిక నైపుణ్యాలకు విశ్వకర్మ ఆద్యుడిగా పూజించబడుతున్నారని పేర్కొన్నారు.

పురాణ గాథల ప్రకారం శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరం, పాండవుల ఇంద్రప్రస్థ రాజభవనం, లంకా నగరం వంటి అద్భుత నిర్మాణాలను విశ్వకర్మ నిర్మించినట్లు ప్రసిద్ధి చెందిందన్నారు. దేవతలకు అవసరమైన అనేక దివ్య ఆయుధాలు, రథాలు, ఇతర పరికరాలను కూడా ఆయన రూపొందించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయని తెలిపారు.

పురాణ సంప్రదాయం ప్రకారం విశ్వకర్మకు సంబంధించిన పంచముఖాల నుంచి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనే ఐదుగురు శిల్పాచార్యులు ఉద్భవించినట్లు విశ్వసిస్తారని తెలిపారు. శిల్ప, వాస్తు, నిర్మాణ, సాంకేతిక విజ్ఞానాల అభివృద్ధిలో వీరి పాత్రను సంప్రదాయంగా గుర్తిస్తారని పేర్కొన్నారు.

విశ్వకర్మ జయంతిని ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక సంస్థలు, వర్క్‌షాప్‌లు, నిర్మాణ రంగ సంస్థలు, ఇతర సాంకేతిక పని ప్రదేశాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారని తెలిపారు. శిల్పులు, వడ్రంగులు, కమ్మరులు, మెకానిక్‌లు, వెల్డర్లు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక కార్మికులు తమ వృత్తికి సంబంధించిన పనిముట్లు, యంత్రాలు, పరికరాలను పూజించడం ఈ పర్వదినం ప్రత్యేకత అన్నారు.

తమ వృత్తిలో నైపుణ్యం, అభివృద్ధి, విజయాలు సాధించాలని, యంత్రాలు సజావుగా పనిచేయాలని, పని ప్రదేశాల్లో ప్రమాదాలు లేకుండా సురక్షితమైన వాతావరణం కలగాలని కార్మికులు విశ్వకర్మను ప్రార్థిస్తారని తెలిపారు. సమాజ అభివృద్ధిలో కార్మికులు, శిల్పులు, సాంకేతిక నిపుణుల శ్రమ ఎంతో కీలకమని, వారి కృషిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

సృష్టి, శ్రమ, సాంకేతిక నైపుణ్యం, వృత్తి గౌరవానికి ప్రతీకగా విశ్వకర్మ జయంతి నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి స్ఫూర్తితో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సమాజ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో విజయ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore