Nellore: వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వాలి.. కలెక్టర్
Nellore: అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకర్లు మరింత చొరవ చూపాలని, అర్హులైన రైతులకు విరివిగా రుణాలు అందించి యాంత్రీకరణను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు.
Nellore: వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వాలి.. కలెక్టర్
నెల్లూరు: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకర్లు మరింత చొరవ చూపాలని, రైతులకు విరివిగా రుణాలు అందించి వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు.
బుధవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చేపట్టిన చర్యలను లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ...
పశుసంవర్థక, మత్స్య, కోళ్ల పరిశ్రమల వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా, బ్యాంకులు రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా, అర్హులైన ఎక్కువ మందికి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి బ్యాంకు ప్రతినెల కనీసం 12 మంది లబ్ధిదారులకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాలు మంజూరు చేసే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.
వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల ఖర్చులు తగ్గి, వ్యవసాయం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్న కలెక్టర్, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, డ్రోన్‌లు తదితర పరికరాల కొనుగోలుకు బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల జారీని వేగవంతం చేసి రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలని సూచించారు.
మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందిస్తున్న పడవల కొనుగోలుకు కూడా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
గిరిజనులు అధికంగా నివసించే గ్రామ పంచాయతీల్లో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించేందుకు కొత్త శాఖల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ, పీఎంఈజీపీ, ముద్ర తదితర పథకాల కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు.
జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న వ్యవసాయ ఎక్స్‌పో-రుణమేళాలో అన్ని బ్యాంకులు చురుకుగా పాల్గొని, తమ బ్యాంకుల్లో అమలవుతున్న పథకాల వివరాలను రైతులకు తెలియజేసి, అవసరమైన రుణ సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్, నాబార్డ్ డీడీఎం బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవేణి, పశుసంవర్థక శాఖ అధికారి రమేష్ నాయక్, మత్స్యశాఖ అధికారి చాంద్ బాషా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.




