Nellore: రైతుల ఆదాయం పెంచే సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి కలెక్టర్!
Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన అగ్రి ఎక్స్‌పో & కిసాన్ మేళాలో కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.
Nellore: రైతుల ఆదాయం పెంచే సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి కలెక్టర్!
నెల్లూరు: వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సాగు విధానాలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. "అగ్రి ఎక్స్‌పోలో" ప్రదర్శించిన సాంకేతికత కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా రైతుల పొలాల్లో ఆచరణలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరులోని ఏ.సి. సుబ్బారెడ్డి స్టేడియంలో బుధవారం నిర్వహించిన అగ్రి ఎక్స్‌పో & కిసాన్ మేళా–2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, ఆధునిక సాంకేతిక పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను పరిశీలించి, వాటి వినియోగం, రైతులకు కలిగే ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతుల అవసరాలు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతుల అవగాహన తదితర అంశాలపై కలెక్టర్ రైతులు, చాంపియన్ ఫార్మర్స్, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖిగా చర్చించారు. రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే ఇటువంటి ఎక్స్‌పోల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
"సాంకేతికత.. యాంత్రీకరణ.. శాస్త్రీయ సాగు"
అగ్రి ఎక్స్‌పోలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 1,000 మంది రైతులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల సాగు, పంటల ఆరోగ్యం, నీటి యాజమాన్యం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రభుత్వ పథకాలపై ఒకే వేదికగా అవగాహన కల్పించారు.
వివిధ వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, ఆధునిక సాగు పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర సాంకేతిక ఉత్పత్తులను రైతులకు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. వ్యవసాయ యంత్ర పరికరాల పనితీరు, వాటి వినియోగం, ప్రయోజనాలను తెలుసుకునేందుకు రైతులు ఆసక్తి చూపారు. తయారీదారులు, శాస్త్రవేత్తలు, అధికారులు రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు.
"ఎల్‌నినో, వాతావరణ పరిస్థితులపై శాస్త్రవేత్తల సూచనలు"
నీటి లభ్యత, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును రైతులు పరిశీలించాలని శాస్త్రవేత్తలు సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంది, మినుము, పెసర, శనగ వంటి పప్పుధాన్యాలను సాగు చేసుకోవాలని సూచించారు.
ఎల్‌నినో, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో బోరు బావుల కింద సాగు చేసే వరి పంటలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. కీలక దశల్లో పంటలకు అవసరమైన నీటిని అందించడంతో పాటు నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
పంట అవశేషాలను కాల్చివేయకుండా పొలంలోనే సక్రమంగా వినియోగించడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థం, పోషకాలు పెరుగుతాయని తెలిపారు. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించాలని సూచించారు.
నెల్లూరు ప్రాంతానికి అనుకూలమైన ఎన్‌ఎల్‌ఆర్ 36896 వరి రకానికి రైతుల్లో మంచి ఆదరణ ఉందని, ఎన్‌ఎల్‌ఆర్ 3238 రకంలో అధిక జింక్ శాతంతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున రైతులు ఈ రకాన్ని కూడా సాగు చేసి ప్రయోజనం పొందవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.
"రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన"
పంటల బీమా, ప్రధానమంత్రి కిసాన్, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, పంట సాగుదారుల హక్కు కార్డులు, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.
సూక్ష్మ సేద్యంలో బిందు, తుంపర సేద్య పరికరాలకు అందుబాటులో ఉన్న రాయితీ, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు లభించే సహాయం, ఉద్యాన పంటల అనంతర నిర్వహణకు సంబంధించిన రాయితీ పథకాలు, ఆయిల్‌పామ్ సాగు అవకాశాలను అధికారులు వివరించారు.
మహిళా రైతులు స్వయం సహాయక సంఘాల్లో చేరడం ద్వారా బ్యాంకింగ్ సేవలు, రుణ సదుపాయాలు పొందడంతో పాటు తినడానికి సిద్ధంగా ఉండే, వంటకు సిద్ధంగా ఉండే ఉత్పత్తుల తయారీ, కోళ్లు, పశువుల పెంపకం వంటి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
"యువత వ్యవసాయాన్ని ఉపాధి అవకాశంగా చూడాలి: జెడ్పీ చైర్‌పర్సన్"
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ, అగ్రి ఎక్స్‌పో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ముఖ్యంగా యువత వ్యవసాయాన్ని ఉపాధి అవకాశంగా స్వీకరించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతలు, వ్యవసాయ పరికరాలను ఒకే వేదికపై తెలుసుకునే అవకాశం రైతులకు లభించిందన్నారు. ఎక్స్‌పోలో తెలుసుకున్న విషయాలను రైతులు తమ గ్రామాలకు తీసుకెళ్లి ఆచరణలో పెట్టాలని సూచించారు.
"రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మేయర్"
మున్సిపల్ చైర్‌పర్సన్ దేవరకొండ సుజాత మాట్లాడుతూ, అగ్రి ఎక్స్‌పో ద్వారా రైతులకు అందించిన విజ్ఞానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఒకే వేదికపై వివిధ వ్యవసాయ పరికరాలు, సాంకేతికతను తెలుసుకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. రైతుల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
"వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం"
పశుపోషణ, ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్, ఆహార శుద్ధి పరిశ్రమలు, రైతు యంత్ర పరికరాల అద్దె కేంద్రాలు, సూక్ష్మ సేద్యం వంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అధికారులు వివరించారు. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా చేపట్టి అదనపు ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు సంబంధించిన నిబంధనలు, రాత్రి వేళల్లో రహదారులపై ప్రయాణించే వ్యవసాయ వాహనాలకు ప్రతిబింబించే పట్టీ ఏర్పాటు వంటి రహదారి భద్రత అంశాలపై కూడా రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు.
"రైతులతో ముఖాముఖి"
కార్యక్రమం అనంతరం నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు పాల్గొన్నారు. వివిధ పంటలు, నీటి యాజమాన్యం, పంట ఆరోగ్యం, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలపై రైతులతో చర్చించారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి మాట్లాడుతూ, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, ఆధునిక ఎరువులు, పురుగుమందులు, వివిధ వ్యవసాయ ఉత్పత్తులను ఒకే వేదికపై రైతులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అగ్రి ఎక్స్‌పో నిర్వహించినట్లు తెలిపారు. సమగ్ర పంటల నిర్వహణ పద్ధతుల కింద రైతులకు అందిస్తున్న శిక్షణ, సాంకేతిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి రమేష్ నాయక్, డీసీవో గుర్రప్ప, వ్యవసాయ శాఖ ఏడీ అనిత, ఏపీఎంఐపీ పీడీ పద్మలత, వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు శ్రీలక్ష్మి, వినీత, శివజ్యోతి, శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్–ఆత్మ ఉషారాణి, డీలర్లు, రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




