Nellore: ఉపాధ్యాయ వృత్తి ఒక గొప్ప బాధ్యత: కలెక్టర్ హిమాన్షు శుక్ల

Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొని 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.

A Praveen, Nellore
Published on: 5 Sept 2026 4:22 PM IST
Nellore
X

Nellore: ఉపాధ్యాయ వృత్తి ఒక గొప్ప బాధ్యత: కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు: నెల్లూరు, కలెక్టరేట్‌లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యావేత్త, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఉపాధ్యాయ వృత్తి ఒక గొప్ప బాధ్యత : కలెక్టర్ హిమాన్షు శుక్ల

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్మించే ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపే రోజుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని, విద్యారంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

“ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే మార్చడు.. ఒక కుటుంబం, ఒక సమాజం, చివరకు ఒక దేశ భవిష్యత్తును మార్చగలడు” అని కలెక్టర్ అన్నారు. ఉపాధ్యాయ వృత్తి సాధారణ ఉద్యోగం కాదని, అది గొప్ప బాధ్యతతో కూడుకున్న సేవ అని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు విద్యార్థులకు ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, మంచి మనిషిగా ఎలా ఎదగాలి అనే విషయాలను కూడా నేర్పుతారని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని, వారి వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, మెరుగైన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. వాటి ఫలితాలు విద్యార్థులకు చేరేలా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి జీవితానికి మలుపు తిప్పగలడని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్య, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలను విద్యలో భాగం చేయాలని సూచించారు. అయితే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం : ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ గురువుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశంలోనే నంబర్ వన్‌గా మార్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే సంకల్పంతో నూతన సంస్కరణల దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. జాతి భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, ఆ భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 72 నుంచి 82 శాతానికి పెరిగిందని, ప్రభుత్వ విధానాల వల్ల విద్యా రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో లక్షా ఆరు వేల మంది విద్యార్థుల సంఖ్య పెరగడం, కొన్ని పాఠశాలల్లో “నో అడ్మిషన్స్” బోర్డులు పెట్టే పరిస్థితి రావడం గర్వకారణమన్నారు.

ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఉత్తమ ఫలితాలు సాధించడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

విలువలతో కూడిన విద్యను అందించాలి : ఆనం అరుణమ్మ

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువులకు సముచితమైన, అత్యున్నత స్థానం ఉందన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు.

విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఒక విద్యార్థిని గొప్ప వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడే శక్తిగా తీర్చిదిద్దే సామర్థ్యం గురువులకు ఉందని తెలిపారు.

విద్యార్థులు గురువులు చూపిన బాటలో క్రమశిక్షణతో నడుస్తూ విద్యలో రాణించడంతో పాటు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు.

58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం

అనంతరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 20 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 18 మంది ప్రధానోపాధ్యాయులు.. మొత్తం 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ప్రత్యేకంగా అభినందించారు. వారి అంకితభావం, నిబద్ధత, నిరంతర కృషి ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్. బాలాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story