Nellore: ఈనెల 29న ఉదయగిరిలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన!

Nellore: ఈనెల 29న ఉదయగిరిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన: రామాపురంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 27 Sept 2026 8:17 PM IST
Nellore
X

Nellore: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 29న (మంగళవారం) ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆదివారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, జేసీ మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఏఎస్‌ఎల్ (అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్) నిర్వహించి, పలు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ముందుగా హెలిప్యాడ్ నుండి ప్రారంభం అయిన ఏ.ఎస్.ఎల్. కాన్వాయ్ ..కాకొల్లవారి పల్లె, ప్రజా వేదిక, తిరిగి హెలిప్యాడ్ కు చేరుకుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రాంతాలను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా వుండాలని, అలాగే త్రాగు నీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా వుండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆత్మకూరు, కావలి ఆర్డిఓలు పావని, ఎలేష, జడ్పి సిఈఓ వసుమతి, డ్వామ పిడి శ్రీనివాస ప్రసాద్, విద్యుత్, ఆర్ అండ్ బి, పీఆర్ శాఖల ఇంజనీర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE