Nellore: కార్యకర్తలను గాలికి వదిలేసి పరారీలో ఉన్న అనిల్: రూప్ కుమార్ ధ్వజం!

Nellore: నమ్మిన కార్యకర్తలను వదిలేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్.. ఎంపీ వేమిరెడ్డిపై విమర్శలు చేయడం విడ్డూరమని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

A Praveen, Nellore
Published on: 30 Aug 2026 11:14 PM IST
Nellore
X

Nellore: కార్యకర్తలను గాలికి వదిలేసి పరారీలో ఉన్న అనిల్: రూప్ కుమార్ ధ్వజం!

నెల్లూరు: నమ్మిన నాయకులను, కార్యకర్తలను గాలికి వదిలేసి, రెండేళ్ల నాలుగు నెలలుగా రాష్ట్రంలో లేకుండా పార్టీని పట్టించుకోకుండా కాలం గడిపిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరమని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులతో ఇతర రాష్ట్రాల్లో కాపురం పెట్టారని, చిన్నప్పుడు చదువుకున్న ఆల్చిగాడు కథలా అనిల్ అప్పుడప్పుడు వచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం క్వార్ట్జ్, తెల్లరాయి, వేమిరెడ్డి గురించి మాట్లాడటం తప్ప అనిల్ ఏమీ చేయడం లేదని, నియోజకవర్గం లేకుండా పోయి రాత్రులు నిద్రలేక పిచ్చిపట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు, జిల్లాల్లో దేనికీ పిలవకపోవడం, వైఎస్సార్ జయంతి/వర్ధంతికి కూడా ఆహ్వానం లేకపోవడమే అనిల్ దౌర్భాగ్యమని, ప్రజల్లో నాయకుడిగా గుర్తుండాలనే ఆరాటంతోనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

నెల్లూరు జిల్లాలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో వేమిరెడ్డి స్థాయి ఎక్కడ, అనిల్ స్థాయి ఎక్కడ అని ప్రశ్నించిన రూప్ కుమార్, రాజకీయాల్లోకి రాకముందు నుంచే వేమిరెడ్డి సొంత డబ్బుతో ధార్మిక, సంక్షేమ సేవలు చేశారని, అధికారంతో కోట్లు సంపాదించి సీటు పోగానే రాష్ట్రం వదిలి వెళ్లిన అనిల్ స్థాయి ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. 2 ఫేజ్‌లలో 1,000 కోట్లతో పెట్టాలనుకున్న క్వార్ట్జ్ ఫ్యాక్టరీ వ్యాపారం నుంచి అనవసర ఆరోపణల దృష్ట్యా ఏడాది క్రితమే వేమిరెడ్డి తప్పుకున్నారని స్పష్టం చేశారు.

అయ్యప్ప మాల వేసుకుని అవినీతి చేయలేదు, అయ్యప్పే చూసుకుంటాడు అని అనిల్ చెప్పాడని, ఆ అయ్యప్ప స్వామే అనిల్‌ను చూసుకున్నాడని ఎద్దేవా చేశారు. మాట ఇస్తే నిలబడే వ్యక్తి వేమిరెడ్డి అని, సైదాపురం క్వార్ట్జ్ మైన్ ఓనర్లు వచ్చి వేమిరెడ్డి 8,000 నుండి 10,000 అడిగారని అనిల్ చెప్పడం పచ్చి అబద్ధమని.. వేమిరెడ్డి 8 కట్టమన్నారని ఒక్క మైన్ ఓనర్ చేత చెప్పించినా దేనికైనా సిద్ధమేనని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

రాజకీయ పుట్టుక నుంచి అనిల్ చరిత్ర మొత్తం తనకు తెలుసని, మాట్లాడితే సంస్కారం అడ్డొస్తోందని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి వెంకటగిరి, రాపూరు నియోజకవర్గాలు అడిగినా పంపించేశారని, దీంతో అనిల్ అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు. పోటీ చేస్తానో లేదో, రాజకీయంలో లేకపోయినా పర్వాలేదని అనిల్ నోటితోనే స్వయంగా చెప్పుకున్నాడని, గతంలో అహంకారంతో మాట్లాడి కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయిన అనిల్‌కు వేమిరెడ్డి పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదన్నారు.

కలవడానికి అనిల్ అసలు అధికారంలో ఉన్నాడా, ప్రతిపక్ష నాయకుడా లేక మాజీ ఎమ్మెల్యేనా అని సైదాపురం మైన్ ఓనర్ల వ్యాఖ్యలపై ప్రశ్నించిన రూప్ కుమార్..వేమిరెడ్డిపై మాట్లాడి పెద్ద హీరో అయిపోతానని భ్రమపడుతున్న అనిల్ ఇప్పటికే జీరో అయిపోయాడని, అతని భవిష్యత్తు ఏంటో కాలమే నిర్ణయిస్తుందని భగవంతుడు అన్నీ చూస్తున్నాడని స్పష్టం చేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story