Kavali: ఎమ్మెల్యే ప్రశంసలు.. కలెక్టర్ పనితీరుకు నేను ఫ్యాన్ అయిపోయాను!

Kavali: కావలి వెంగళరావు నగర్‌లో దశాబ్దాల చుక్కల భూముల సమస్య పరిష్కారం. 2000 కుటుంబాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే.

GORRIPATI HARISH, KAVALI TOWN
Published on: 28 April 2026 10:31 AM IST
Kavali
X

Kavali: ఎమ్మెల్యే ప్రశంసలు.. కలెక్టర్ పనితీరుకు నేను ఫ్యాన్ అయిపోయాను!

Kavali: "కావలి వెంగళరావు నగర్‌లో సుమారు రెండు వేల కుటుంబాలకు ఎంతో కొంత మంచి చేసాననే సంతృప్తి కలిగింది” అని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. సోమవారం కావలి పట్టణంలో పర్యటించిన ఆయన, ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంగళరావు నగర్ లో నిర్వహించిన చుక్కల భూమి విముక్తి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఈ సమస్యపై ప్రత్యేకంగా చర్చించినప్పుడు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చానని, ఆ మేరకు అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యను పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా పనిచేశారని, వారికి అభినందనలు తెలిపారు.

తాను ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పిన “కలెక్టర్‌గా ఉన్న అవకాశాలను ప్రజల మేలు కోసం వినియోగించాలి” అనే మాటలను ఎప్పటికీ గుర్తుంచుకుని పనిచేస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ చుక్కల భూముల సమస్యకు సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎంతో కృషి చేశారని, ఆయన సహకారంతోనే అధికార యంత్రాంగం వేగంగా స్పందించగలిగిందని తెలిపారు.సుమారు రెండు వేల కుటుంబాలకు ఈ చుక్కల భూముల సమస్య పరిష్కారం వల్ల మంచి జరిగిందని కలెక్టర్ చెప్పారు.

రాబోయే రోజుల్లో కావలి పట్టణం గోల్డెన్ సిటీగా మారుతుందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో వచ్చే రెండేళ్లలో ఊహించని అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల సరసన కావలి కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇంకా జిల్లాలో చుక్కల భూముల సమస్యలు ఎక్కడైనా ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, రెండు రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

దమ్మున్న అధికారులు ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు : ఎమ్మెల్యే కృష్ణారెడ్డి

ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, దమ్మున్న అధికారులు ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని ఈ ఘటన నిరూపించిందన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు కావలి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారు 190 ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కారంతో వెంగళరావు నగర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, ఈ రోజు కావలి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు తమ ఇళ్లపై హక్కులు లేకుండా, పిల్లల చదువులకు రుణాలు పొందలేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.

ఎన్నికల హామీ మేరకు సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని, ఇకపై ఈ సర్వే నంబర్లలోని భూములను పూర్తి హక్కులతో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్‌పై తనకు ఎంతో అభిమానం పెరిగిందని, తాను ఆయనకు “ఫ్యాన్”గా మారిపోయానని వ్యాఖ్యానించారు. కావలి అభివృద్ధిపై కలెక్టర్ చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయం అని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుండగా, జిల్లా స్థాయిలో కలెక్టర్ అదే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. బీపీసీఎల్, ఇండోస్ పరిశ్రమలు, దామవరంలో విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు అమలైతే కావలి పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని, పరిశ్రమల ద్వారా యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. కావలి ప్రజలు శాంతికాముకులని, జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతంపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ మరింత కొనసాగాలని కోరారు.

చుక్కల భూముల సమస్య పరిష్కారంతో వెంగళరావు నగర్ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌ను, జాయింట్ కలెక్టర్ ను ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం చుక్కల భూముల సమస్యను పరిష్కరిస్తూ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రోసిడింగ్ ఉత్తర్వుల కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. తొలుత రైల్వే అండర్‌పాస్ పనులను ఎమ్మెల్యే తో కలిసి పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఉదయగిరి రోడ్ నుంచి ఐడిఎస్ఎంటీ లేఅవుట్ వరకు సుమారు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎలీషా బాబు, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

GORRIPATI HARISH, KAVALI TOWN

GORRIPATI HARISH, KAVALI TOWN

Next Story