Sriharikota: అంబేద్కర్ ఆశయాలు దేశానికి దిక్సూచి.. షార్ డైరెక్టర్ సందేశం
Sriharikota: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని ఎస్‌డీఎస్‌సీ షార్ (SDSC SHAR) పరిధిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మారక ఉపన్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది.
Sriharikota: అంబేద్కర్ ఆశయాలు దేశానికి దిక్సూచి.. షార్ డైరెక్టర్ సందేశం
Sriharikota: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట శ్రీహరికోటలోనీ (షార్) పరిధిలోని MRK ఆడిటోరియంలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మారక ఉపన్యాస కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు కస్టమ్స్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా అతిథులు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉషా కిరణ్ ప్రసంగిస్తూ, డాక్టర్ అంబేద్కర్ జీవితం, ఆయన పాటించిన అత్యున్నత నైతిక విలువలు మరియు సమ సమాజ స్థాపన కోసం ఆయన చేసిన రాజీలేని పోరాటాన్ని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు ఆయన అందించిన అపారమైన సేవలను కొనియాడారు.
SDSC SHAR కంట్రోలర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో, అధికారిక పర్యటన నిమిత్తం బెంగళూరులో ఉన్న SDSC SHAR డైరెక్టర్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు నేటికీ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని, ఆయన కృషిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని డైరెక్టర్ తన సందేశంలో పేర్కొన్నారు.
SC & ST సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. రాము మరియు ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కిరణ్ మాట్లాడుతూ, సమాజంలోని అసమానతలను రూపుమాపడంలో డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గం అత్యంత కీలకమని, ఆయన సిద్ధాంతాలను యువత ఆచరించాలని కోరారు. అంబేద్కర్ ఆలోచనా విధానం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎలా బాటలు వేసిందో వారు వివరించారు.
అనంతరం, ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, ఉద్యోగస్తులు, SC & ST సంక్షేమ సంఘం సభ్యులు మరియు ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో చైతన్యాన్ని నింపేలా కొనసాగింది. దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు.




