Duttalur: నెల్లూరు జిల్లా అడవిలో మర్మ మరణం.. మృతదేహంపై గడ్డి కప్పి ఉంచడంపై మిస్టరీ!
Duttalur: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం గుండెమడకల రిజర్వ్ ఫారెస్ట్‌లో వింజమూరుకు చెందిన గోవిందులు అనే వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.
Duttalur: నెల్లూరు జిల్లా అడవిలో మర్మ మరణం.. మృతదేహంపై గడ్డి కప్పి ఉంచడంపై మిస్టరీ!
దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని గుండెమడకల రిజర్వ్ ఫారెస్ట్‌లో వెలుగుచూసిన ఓ మర్మ మరణం ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తోంది. వింజమూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన దేవరకొండ గోవిందులు(55) మృతదేహం అడవిలో అనుమానాస్పద పరిస్థితుల్లో లభ్యమైంది.మృతదేహంపై గోనెసంచి కప్పి, ఆ గోనెసంచిపైనే వరిగడ్డి కప్పి ఉంచడం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకు దారితీస్తోంది. ఒకవేళ ఇది సహజ మరణమే అయితే... మృతదేహంపై గోనెసంచి ఎందుకు కప్పారు..? దానిపై వరిగడ్డి ఎందుకు వేశారు..? మృతుడు అడవిలోకి ఎలా చేరుకున్నాడు..? మరణించిన తర్వాత ఎవరైనా మృతదేహాన్ని అక్కడ ఉంచారా..? లేక ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం జరిగిందా..?
మృతదేహాన్ని ఇలా కప్పి ఉంచడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి..? ఇది హత్యేనా..? అయితే హత్య చేసిన వారు ఎవరు..? ఎక్కడ హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చారు..? లేక ఈ ఘటన వెనుక మరో కోణం ఏమైనా ఉందా..?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.సమాచారం అందుకున్న దుత్తలూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహానికి స్పాట్ పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేశారు.కావలి ఎస్డీపీఓ పర్యవేక్షణలో, ఉదయగిరి సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. గుండెమడకల అడవిలో వెలుగుచూసిన ఈ మర్మ మరణం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.




