Naidupeta: స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక తోడేతపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి ఆగ్రహం!
Naidupeta: నాయుడుపేట స్వర్ణముఖి నదిలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలను అరికట్టాలని తిరుపతి జిల్లా అధికారులను డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.
Naidupeta: స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక తోడేతపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి ఆగ్రహం!
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నదిలో ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్లకు పైగా పాలన సాగిస్తున్నా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమంగా తరలించడంతో పాటు బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయాలు కూడా విచ్చలవిడిగా సాగుతున్నాయని అన్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ముఖ్యంగా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ కొనసాగుతున్నాయని తెలిపారు. నాయుడుపేట బీడీ కాలనీ సమీపంలోని స్వర్ణముఖి నదిలో గ్రావెల్, రబ్బిష్‌తో రహదారి ఏర్పాటు చేసి, దాని ఇరువైపులా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అక్రమ తవ్వకాల కారణంగా నదిలో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని, వర్షాకాలంలో వాటిలో నీరు నిలిచినప్పుడు సమీప కాలనీల ప్రజలు, పిల్లలు, పశువులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో అడ్డంగా రహదారులు నిర్మించడం వల్ల సహజ నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడటంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు.
స్వర్ణముఖి నది ద్వారా నాయుడుపేట, సూళ్లూరుపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయని, నది సహజ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు.
ఇసుక దోపిడీపై రైతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాల్లో వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేసిన ఘటనలు ఉన్నాయని, అయితే అక్రమ ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదని ఆరోపించారు. పత్రికలు, మీడియా ద్వారా అనేకసార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
స్వర్ణముఖి నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాల విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీవో, డీఎస్పీ, సీఐ, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయినప్పటికీ అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతుండటం ఆందోళనకరమన్నారు.స్వర్ణముఖి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక, గ్రావెల్, మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నదిలో అడ్డంగా నిర్మించిన రహదారులను తక్షణమే తొలగించి, సహజ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని కోరారు. సహజ వనరులను కాపాడి, ప్రజల భవిష్యత్ తాగునీటి అవసరాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ కుమార్, రాష్ట్ర కళాకారుల విభాగం కార్యదర్శి కటకం జయరామయ్య, మాజీ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ షబీర్, పేట చంద్ర రెడ్డి, సిద్ధాయ్య, నాయుడుపేట పట్టణ కార్యదర్శి పేర్నాటి రాహుల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాయపు శేఖర్, నెలవల రవి తదితరులు పాల్గొన్నారు.




