Tada: తడలో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' దందా.. నకిలీ క్లినిక్‌పై స్థానికుల ఆగ్రహం!
Tada: నెల్లూరు జిల్లా తడ మండల కేంద్రంలో ఎటువంటి అర్హత లేకుండా 'శంకర్ క్లినిక్' పేరుతో సాగుతున్న నకిలీ వైద్య దందాపై స్థానికులు మండిపడుతున్నారు.
Tada: తడలో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' దందా.. నకిలీ క్లినిక్‌పై స్థానికుల ఆగ్రహం!
తడ: మండల కేంద్రంలోని రద్దీగా ఉండే మెయిన్ బజార్‌లో 'శంకర్ క్లినిక్' పేరుతో సాగుతున్న అక్రమ వైద్య దందా స్థానికులను ఉలిక్కిపడేలా చేస్తోంది. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాలో హీరో నకిలీ డిగ్రీలతో డాక్టరుగా ఎలాగైతే చలామణి అయ్యాడో, ఇక్కడ కూడా సరిగ్గా అదే తరహాలో ఎటువంటి వైద్య అర్హత లేని ఓ వ్యక్తి డాక్టరుగా అవతారమెత్తి అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. తెల్లకోటు వేయలేదు కానీ 'శంకర్' డాక్టరునని నమ్మిస్తాడు, ముందు వెనుక చూడకుండా ప్రాణాంతకమైన మ్యాజిక్ ఇంజక్షన్లు గుచ్చుతాడు, ప్రాణాల మీదకు తెచ్చి మందుల పేరుతో జేబులు ఖాళీ చేస్తాడు, తడ బజారులో ఈ నకిలీ వైద్యం నిత్యం మరణశాసనమై నిలుస్తోంది.
ఈ క్లినిక్ ప్రధాన రహదారిపైనే ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా మారింది. రోగ నిర్ధారణ చేయకుండానే క్లినిక్‌కు వచ్చే ప్రతి రోగికి ఇష్టానుసారంగా రెండు నుండి మూడు ఇంజక్షన్లు వేయడం సదరు వ్యక్తికి అలవాటుగా మారింది. ముఖ్యంగా నొప్పి నివారణ పేరుతో శక్తివంతమైన స్టెరాయిడ్లను వాడుతుండటంతో బాధితులు కిడ్నీ మరియు కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ఆరోగ్యాలను బలితీస్తావా, శంకర్ పేరు పెట్టుకుని అమాయకులను మృత్యువుకు దగ్గర చేస్తావా, ఆగండి ప్రాణాలు తీసే ఈ అక్రమ ఆటలు ఇకనైనా ఆపండి అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ప్రిస్క్రిప్షన్లు లేకుండా ప్రమాదకర మందుల అమ్మకం, రాత్రింబవళ్లు సాగుతున్న ఈ అక్రమ దందాపై ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించాలి. తడ మండల స్థాయి అధికారులు మొదలుకుని, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) స్థాయి వరకు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. తక్షణమే 'శంకర్ క్లినిక్'పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కఠినమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ డాక్టర్ల భరతం పట్టి, తడ ప్రజలకు మెరుగైన భద్రత కల్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




