Nellore: అవినీతిపై చర్చకు రా.. ఎమ్మెల్యే సోమిరెడ్డికి కాకాణి సవాల్

Nellore: సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, అవినీతిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.

V. Narasimhulu, Nellore
Published on: 13 Jun 2026 9:30 PM IST
Nellore
X

Nellore: అవినీతిపై చర్చకు రా.. ఎమ్మెల్యే సోమిరెడ్డికి కాకాణి సవాల్

Nellore: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని పొదలకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కూటమి పాలకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మామ అన్నట్లుగా నిన్న తిరుపతిలో సభ పెట్టి ముగించారని కాకాణి విమర్శించారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒకసారి పరిశీలిస్తే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుందని కాకాణి అన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి సహజ నైజం అని ఆయన విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అవినీతిపై రానున్న కాలంలో బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాకాణి హెచ్చరించారు.

చర్చకు సవాల్ అనడం ఆపై పరార్ కావడం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మామూలే అన్నారు. నియోజకవర్గం లో జరిగే అవినీతిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు కాకాణి. నెల్లూరు జిల్లాలో రెండో పంటకు అనుమతిస్తూ... సాగు చేస్తున్న రైతులకు యూరియా అందుబాటులో లేకుండా చేశారని కాకాణి మండిపడ్డారు. కొందరు రైతులు యూరియా దొరక్క వేసిన నారుమళ్ళను నిలువునా ట్రాక్టర్లతో తొక్కేసినట్లు తమ దృష్టికి తెచ్చారని. యాప్ లో సాంకేతిక సమస్యలను చెప్పి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారని కాకాణి చెప్పారు.

కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు.. ప్రజలను మోసం చేశారు: మాజీ మంత్రి కాకాణి ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కూటమి వెన్నుపోటు రాజకీయాలకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు కూటమి పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. "చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారు" అని ఆయన అన్నారు.

సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని కాకాణి స్పష్టం చేశారు. "నీ చెంచాలను పంపించడం కాదు, నువ్వే నేరుగా చర్చకు రా" అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story