Nellore: ఆరుగాలం కష్టపడే రైతుకు నీరందించండి.. ప్రభుత్వానికి మేకపాటి విజ్ఞప్తి!
Nellore: సాగునీటి విడుదల నేపథ్యంలో కాలువల పూడికతీత పనులను తక్షణమే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి డిమాండ్.
Nellore: ఆరుగాలం కష్టపడే రైతుకు నీరందించండి.. ప్రభుత్వానికి మేకపాటి విజ్ఞప్తి!
Nellore: జిల్లాలో రానున్న పంటకాలానికి సాగునీటిని విడుదల చేసే లోపు కాలువల పూడికతీత, మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ—రైతులకు సమయానికి సాగునీరు అందాలంటే ముందస్తు చర్యలు అత్యవసరమని స్పష్టం చేశారు. రెండో పంటకు సాగునీరు విడుదల నేపథ్యంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో జలాశయంలో ప్రస్తుతం ఉన్న 58 టీఎంసీల నీటిలో 49 టీఎంసీలను వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసిన ఈ సమయంలో కాలువలు సక్రమంగా లేకపోతే నీరు చివరి దాకా చేరక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో వచ్చిన మెంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మతుల కోసం ఆత్మకూరు నియోజకవర్గంలో 199 పనులకు ఎఫ్‌డీఆర్ నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, ఆ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయో అధికారులు ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. సుమారు రూ.10 కోట్లకు పైగా వ్యయంతో ఎఫ్‌డీఆర్ పనులు ప్రతిపాదించినట్లు తెలిసినా, ఏ మండలంలో ఎలాంటి పనులు చేపట్టారు, వాటి పురోగతి ఏమిటో స్పష్టత ఇవ్వాలని అన్నారు. అనంతసాగరం, మర్రిపాడు, ఏఎస్‌పేట, సంగం, చేజర్ల మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే 165 చెరువులను తక్షణమే పరిశీలించి, సాగునీరు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రణాళికాబద్ధంగా పనులు వెంటనే ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మేకపాటి విక్రమ్ రెడ్డి కోరారు.




