Nellore: అన్నమయ్య సర్కిల్ లో.. ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ

Nellore: నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు. ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

V. Narasimhulu, Nellore
Published on: 5 Jun 2026 12:33 PM IST
Nellore
X

Nellore: అన్నమయ్య సర్కిల్ లో.. ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ

Nellore: మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు తాజా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. నెల్లూరులోని ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటుచేసిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని.. ఎస్పీ కుటుంబ సభ్యులు, పలువురు గాయకులతో కలిసి నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అమర స్వర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, అలాగే సంగీతార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం.. తాము ఆస్వాదించండం ఎంతో ముదావహమన్నారు..

పరభాషలు ఎన్నైనా తెలుగు భాషకు సాటిరావని, వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. భావితరం ఆంగ్ల భాష వ్యామోహం, పాశ్చాత్య సంస్కృతి వ్యామోహాన్ని వీడాలని, పిల్లలకు చిన్ననాటి నుంచే మన భాష, మన సంస్కృతి పై ఆసక్తి పెంచాలన్నారు. పిల్లలకు నేర్పించాల్సింది విద్యాబుద్ధులనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని, సంస్కారం నేర్పని విద్య.. పండితులను తయారు చేయగలదేమో గాని, బాధ్యతాయుతమైన పౌరులను తయారుచేయలేదని చెప్పారు.

అందుకే వారికి మన పురాణాలను పరిచయం చేయాలని, చరిత్రలోని మహనీయుల గురించి తెలియజేయాలన్నారు. మన పాటలు నేర్పాలి. మన పద్యాలను వల్లె వేయించాలి. మొత్తంగా భారతీయ సంస్కృతి తెలియజేసిన సంస్కారాన్ని పరిచయం చేయాలి." అని సూచించారు.

బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలోనే ఒక అద్భుత మైలురాయి అని, తెలుగు సినిమా సంగీతానికి 'ఘంటసాల – బాలూ' ద్వయం స్వర్ణయుగాన్ని తీసుకువచ్చి, తెలుగు పాటలకు పట్టాభిషేకం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృ హృదయ సింహాసనాలపై కూర్చోబెట్టారని అన్నారు.

తన దినచర్యలో బాలు గారి గాత్రం ఒక అంతర్భాగం అయిందని చెప్తూ, తాను రోజూ నిద్రలేచి మిగతా పనులు ప్రారంభించే ముందు అన్నమాచార్యుల కీర్తనలు, ఘంటసాల మరియు బాలసుబ్రహ్మణ్యం ల, పాటలు విని మాత్రమే తన కార్యక్రమాలను ప్రారంభిస్తానని, కేవలం తనే కాకుండా ఎందరో తెలుగు ప్రజల నిత్య జీవితాల్లోనూ, ఆలయాల సుప్రభాత సంగీత నివేదనల్లోనూ బాలు స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉందని గుర్తుచేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం పేరు స్మరించుకోగానే తనకు శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ప్రసిద్ధ కవితా సంపుటి "అమృతం కురిసిన రాత్రి" గుర్తుకు వస్తుందని, అందులోని “ఆనందం మనిషైన వాడు, జీవితాన్ని ప్రేమించిన వాడు, జీవించడం తెలిసిన వాడు” అనే పంక్తులు, దేవతలు సైతం కీర్తించేలా ఉండే ఆ వ్యక్తిత్వం బాలుకి అచ్చుగుద్దినట్లు సరిపోతాయన్నారు.

ఆ కవిత ముగింపులో వచ్చే.. “అమృతంపు సోన దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను.. దుఃఖాన్నీ, చావునీ వెళ్ళిపొమ్మన్నాను.. ఈ నాటికీ ఎవరికీ తెలియదు నేను అమరుడనని” అనే మాటలు బాలూ జీవితానికి అక్షరాలా వర్తిస్తాయని భావోద్వేగంగా పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం తనకు ఎంతో ఆత్మీయులని, వయసులో తనకంటే కాస్త పెద్దవారైనప్పటికీ తనపై ఎంతో అభిమానం, గౌరవం చూపేవారని చెప్తూ, బాలు తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అంకితభావాన్ని గుర్తు చేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవ చూపారని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా సమన్వయపరిచారని లాయర్ పత్రిక అధినేత శివ ప్రభాత్ రెడ్డిని నాయుడు అభినందించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story