Kandukur: కందుకూరులో భూ కుంభకోణం: నలుగురు అరెస్ట్!

Kandukur: రంగారెడ్డి జిల్లా కందుకూరులో భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ పత్రాలు, జీపీఏ పేరుతో మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

K Sai, Maheswaram
Published on: 26 Aug 2026 12:26 PM IST
Kandukur
X

Kandukur: కందుకూరులో భూ కుంభకోణం: నలుగురు అరెస్ట్!

Kandukur: నకిలీ పత్రాలు సృష్టించి, భూ యజమానుల సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో కందుకూరు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కందుకూరు సీఐ హెచ్. వెంకటేశ్వర్లు వెల్లడించారు.

కందుకూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 151, 152, 153, 165, 166లో మొత్తం సుమారు 31 ఎకరాల 36 గుంటల భూమికి సంబంధించి ఈ మోసం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఎలా జరిగింది అంటే...

దర్యాప్తులో భాగంగా కొంతమంది భూ యజమానుల అనుమతి లేకుండానే వారి సంతకాలను ఫోర్జరీ చేసి, వారు భూమి అభివృద్ధికి అంగీకరించినట్లుగా చూపిస్తూ “Development Agreement-cum-Irrevocable General Power of Attorney” పేరుతో నకిలీ పత్రాన్ని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నకిలీ పత్రాల ఆధారంగా భూములను అభివృద్ధి చేసి, లేఅవుట్ చేయడం ద్వారా అక్రమంగా ఆర్థిక లాభం పొందేందుకు నిందితులు ప్రయత్నించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నలుగురి అరెస్ట్

ఈ కేసులో భాగంగా ఆగస్టు 24, 2026న కందుకూరు పోలీసులు A1 పోలిశెట్టి మల్లికార్జున, A2 మర్రిపల్లి శ్రీనివాస్, A3 వాడల రాజేంద్రనాథ్, A4 ఆదిక మంజునాథ్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నేరానికి సంబంధించిన 18 పేజీల ఒరిజినల్ Development Agreement-cum-Irrevocable GPA పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో మరికొందరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని కందుకూరు పోలీసులు తెలిపారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram