Nellore: భారతదేశ చరిత్రలోనే తొలిసారి.. ఏపీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం!
Nellore: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు 'తాలీం ఏ హునర్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్' ద్వారా 250 మంది పేద విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యను అందించనున్నారు.
Nellore: భారతదేశ చరిత్రలోనే తొలిసారి.. ఏపీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం!
Nellore: నెల్లూరు నగరంలోని హరనాథ పురంలో గల ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ట్యాలెంట్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ లను విడుదల చేశారు. అనంతరం హాల్ టికెట్ లను విద్యార్థులకు అందచేశారు. విద్యార్థుల తల్లితండ్రులు అబ్దుల్ అజీజ్ ను సన్మానించారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చరిత్ర సృష్టించిందని అన్నారు. వక్ఫ్ బోర్డు కేవలం ఆస్తులు పరిరక్షించడమే కాదని, పేద బిడ్డల విద్య ఉపాధి బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ వక్ఫ్ బోర్డ్ తాలీం ఏ హునర్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా 250 మంది విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్య అందించనున్నామని తెలిపారు. ఈ ఒక కార్యక్రమమే కాదని, ఒక ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా అనేక విద్యా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్య జీవితానికి మలుపు అని అందుకే ఇంటర్మీడియట్లో ఉన్నత విద్య అందించాలని ముందుకు వచ్చామని అన్నారు. ప్రస్తుత కాంపిటీటివ్ పరిస్థితుల్లో రెసిడెన్షియల్ విద్య తప్పనిసరి అని అన్నారు. కేవలం ఏడు రోజుల వ్యవధిలో 7392 మంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న వారందరూ ప్రతిభావంతులేనని అన్నారు. విద్యకు పేదరికం అడ్డుకాకూడదు అనే ఆలోచనతో ముందుకు వచ్చామని, భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం అందిస్తామని అన్నారు.
అమ్మాయిని ప్రోత్సహించాలని 33% రిజర్వేషన్ కల్పించామని, అయితే 55% మహిళలే అప్లై చేసుకున్నారని అన్నారు. ఆడపిల్లలు స్వతహాగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బైపిసి కి 30 శాతం మంది ఎంపీసీ కి 70 శాతం మంది అప్లై చేసుకున్నారని, అదే నిష్పత్తితో సీట్లు కేటాయిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఫరూక్ లోకేష్ ల ఆశీర్వాదాల వల్లే కార్యక్రమం ఇంత సాఫీగా జరుగుతుందని అన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దీన్ని అమలు చేస్తున్నామని అన్నారు ఇది కేవలం పేద మధ్యతరగతి వారికి మాత్రమే పెట్టామని అన్నారు. అనంతపురం లో ఒకటి, గుంటూరు లో ఏడు, కడప లో మూడు, కర్నూలు లో రెండు, నంద్యాలలో రెండు, నెల్లూరులో మూడు, రాజమండ్రిలో రెండు, తిరుపతిలో రెండు, విజయవాడలో మూడు, విశాఖలో రెండు చొప్పున మొత్తం 27 సెంటర్లలో పరీక్ష నిర్వహించబోతున్నామని తెలిపారు.
17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నామని, పరీక్ష నిర్వహణ కోసం 360 మంది ఇన్విజిలేటర్ లను నియమించామని, పరీక్ష నిర్వహణ చాలా పారదర్శకంగా ఉంటుందని, పరీక్ష విధివిధానాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరూ భయపడకుండా ధైర్యంగా ఎగ్జామ్ రాయాలని మీరందరూ కచ్చితంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులను రెండు సంవత్సరాలు మా చేతికి ఇస్తే సైనికుల్లా తయారు చేస్తామని, వారిని ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని అన్నారు.




