Kanigiri: కనిగిరిలో గంజాయి బ్యాచ్ అరాచకం వృద్ధురాలిపై దాడి!
Kanigiri: కనిగిరి ఇందిరానగర్‌లో గంజాయి బ్యాచ్ అరాచకం. అడ్డువచ్చిన వృద్ధురాలిపై దారుణ దాడి. కత్తులు, గుడ్డళ్లతో బెదిరింపులు.. పోలీసుల చర్యలకు స్థానికుల డిమాండ్.
Kanigiri: కనిగిరిలో గంజాయి బ్యాచ్ అరాచకం వృద్ధురాలిపై దాడి!
Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరి టౌన్ ఇందిరానగర్ 9వ వార్డులో గంజాయి మూకలు అరాచకం సృష్టించాయి. స్థానికంగా ఉన్న గంజాయి బ్యాచ్ నిత్యం వీరంగం సృష్టిస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
ఈ ప్రాంతంలో గంజాయి సేవించే కొందరు యువకులు తరచూ గొడవలకు దిగుతున్నారని, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రెండు రౌండ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తామని ఎస్సై హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని బాధితులు మండిపడుతున్నారు. తాజాగా ఇందిరానగర్ వీధిలో ఓ యువకుడిని (పాములవారి పిల్లలను) ఇద్దరు నిందితులు కత్తులతో వెంబడించారు. ప్రాణభయంతో సదరు యువకుడు ఇంట్లోకి పరుగెత్తగా నిందితులు ఇళ్లలోకి చొరబడి మరీ దాడికి పాల్పడ్డారు.
ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన స్థానిక బాధితుడు కృష్ణపై సైతం దుండగులు ఎదురుదాడికి యత్నించారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన కృష్ణ తల్లి (వృద్ధురాలిని) జుట్టు పట్టుకుని కిందకు నెట్టేసి దారుణంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా, సినిమా ఫక్కీలో గుడ్డేలు (మారణాయుధాలు) పట్టుకుని వచ్చి "మిమ్మల్ని బతకనివ్వము, ఎప్పటికైనా లేపేస్తాము" అంటూ బహిరంగంగా ప్రాణభయానికి గురిచేశారు.
ఈ దారుణ ఘటన జరుగుతున్న సమయంలో బాధితులు 100, 112 అత్యవసర నంబర్లకు ఫోన్ చేసినప్పటికీ అధికారుల నుండి ఎలాంటి స్పందన కరువైంది. దీంతో విసిగిపోయిన బాధితులు నేరుగా స్థానిక ఎస్సై ని ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్సై నిందితులను పిలిపించి విచారిస్తామని హామీ ఇచ్చారు. అయితే గంజాయి మూకల వరుస బెదిరింపులతో తాము ప్రాణభయంతో బతుకుతున్నామని, పోలీసులు కేవలం హామీలతో సరిపెట్టకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకుని తమకు తగిన రక్షణ కల్పించాలని బాధితుడు కృష్ణతో పాటు ఇందిరానగర్ నివాసితులు డిమాండ్ చేస్తున్నారు.




