Nellore: ప్రభుత్వ బడి చదువులకు హద్దులు లేవు యనమల దంపతుల ఆదర్శం!

Nellore: నెల్లూరు: ప్రభుత్వ బడిలో చదివి ఉన్నత శిఖరాలకు చేరిన ముగ్గురు పిల్లలు యనమల ఉపాధ్యాయ దంపతుల ఆదర్శ ప్రస్థానం.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 4 Sept 2026 12:18 PM IST
Nellore
X

Nellore: ప్రభుత్వ బడి చదువులకు హద్దులు లేవు యనమల దంపతుల ఆదర్శం!

Nellore: ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉన్నత స్థాయికి ఎదగలేమనే అపోహలకు చెక్ పెడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివిన ముగ్గురు పిల్లలను అత్యున్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఓ ఉపాధ్యాయ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తాను కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ఎదిగిన తండ్రి,అదే క్రమశిక్షణ, పట్టుదల, విద్యా విలువలను తన పిల్లల్లో నింపారు. ఫలితంగా ముగ్గురు పిల్లలు వైద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.

యనమల తిరుపతి ప్రస్తుతం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పోలిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోషల్ టీచర్‌గా సేవలందిస్తున్నారు. ఆయన సతీమణి రజనీ కుమారి.ఈమె కూడా ఉపాధ్యాయినిగా నందిపాడులో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డ్ గ్రహీత. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తిరుపతి చిన్ననాటి నుంచే చదువుపై మక్కువ పెంచుకుని, ఎన్నో కష్టాలను అధిగమిస్తూ విద్యను పూర్తిచేశారు.

పట్టుదలతో చదివి ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టి.. నేడు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఆయన, తన సొంత పిల్లల భవిష్యత్తును కూడా అంతే బాధ్యతగా తీర్చిదిద్దారు.యనమల తిరుపతి–రజనీ కుమారి దంపతులకు ముగ్గురు సంతానం. ఈ కుటుంబంలో మరో విశేషం ఏమిటంటే ముగ్గురు పిల్లలూ ఆగస్టు 12వ తేదీనే జన్మించారు. అయితే వేర్వేరు సంవత్సరాల్లో జన్మించినప్పటికీ, ఒకే తేదీన పుట్టిన ఈ ముగ్గురూ విద్యలో మాత్రం తమదైన ముద్ర వేస్తున్నారు.

పెద్ద కుమారుడు యనమల అఖిల్ 12-08-2000న జన్మించారు.దుత్తలూరు హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన అఖిల్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి వైద్య విద్యలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.ప్రస్తుతం విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో యం.డి (సైకియాటరీ ) అభ్యసిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాల నుంచి వైద్య రంగంలో ఉన్నత చదువుల వరకు ఆయన సాగించిన ప్రయాణం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.రెండో కుమార్తె జెస్సికా 12-08-2003న జన్మించారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం యం.యస్సి అగ్రికల్చర్ చదువుతున్నారు.వ్యవసాయ విద్యను ఎంచుకుని భవిష్యత్తులో రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.చిన్న కుమార్తె అస్మిత 12-08-2009న జన్మించారు. ఈమె నవోదయ, కృష్ణాపురం ప్రభుత్వ విద్యా వ్యవస్థలోనే చదువుకుని ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నందు 2026లో ఎం.బి.బి.ఎస్ సీటు సాధించారు.చిన్న వయసులోనే వైద్య విద్యను ఎంచుకుని ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆమె కుటుంబంలో మరో వైద్య నక్షత్రంగా మెరవనున్నారు.

పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందనే భావనకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించినా క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే పిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగగలరని యనమల కుటుంబం నిరూపిస్తోంది.ఈ సందర్భంగా యనమల తిరుపతి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ చదువుకున్నాను. ఆ కష్టాల నుంచే ఉపాధ్యాయుడిగా ఎదిగాను అన్నారు.

రజనీ కుమారి మాట్లాడుచూ నా స్కూల్ పిల్లలలాగే నా పిల్లలకు కూడా క్రమశిక్షణ, కష్టపడి చదివే తత్వాన్ని అలవాటు చేశాను. వారిని ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివించాను. పిల్లలపై నమ్మకం ఉంచి, వారికి సరైన దిశానిర్దేశం చేస్తే వారు ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలరని నమ్మాను. నేడు నా ముగ్గురు పిల్లలు ఈ స్థాయిలో ఉండటం నాకు ఎంతో గర్వంగా ఉంది,అని తెలిపారు.ముగ్గురు పిల్లలు.. మూడు విజయ మార్గాలు ఒకరు యం డి (సైకియాటరీ ) వైపు,మరొకరు వ్యవసాయంలో మాస్టర్స్ డిగ్రీ వైపు, ఇంకొకరు ఎం.బి.బి.ఎస్ వైపు అడుగులు వేస్తూ,ముగ్గురూ తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటున్నారు.

తల్లిదండ్రుల ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్య విలువను చాటితే.. పిల్లలు తమ ప్రతిభతో ఆ విలువను నిలబెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత విద్యలో రాణిస్తున్న యనమల కుటుంబం..ప్రభుత్వ బడి చదువులకు హద్దులు లేవు.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పిల్లల కష్టం ఉంటే విజయానికి ఆకాశమే హద్దు అనే సందేశాన్ని సమాజానికి అందిస్తోంది.తిరుపతి దంపతుల కష్టానికి, త్యాగానికి, క్రమశిక్షణతో పిల్లలను పెంచిన తీరుకు ముగ్గురు పిల్లల విజయాలే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story