Doravarisatram: దొరవారిసత్రంలో యథేచ్ఛగా 'ఎర్ర' బంగారం తరలింపు!
Doravarisatram: తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గ్రావెల్ అక్రమ రవాణా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం.
Doravarisatram: దొరవారిసత్రంలో యథేచ్ఛగా 'ఎర్ర' బంగారం తరలింపు!
Doravarisatram: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ తోడకాలు, అనుమతులేని రవాణాపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడమే కాకుండా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పలుమార్లు అధికారులను హెచ్చరించినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పూ రావడం లేదు.
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెలపట్టు సమీపంలో గ్రావెల్ (ఎర్ర మట్టి) అక్రమ తోడకం, తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. ప్రజాప్రతినిధులు తీవ్రంగా పరిగణించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, రోశనూరు పరిసర ప్రాంతాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో భారీ టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తవ్వి నాయుడుపేట మార్గంలోని జాతీయ రహదారిపైకి తరలిస్తూనే ఉన్నారు.
సంబంధిత అధికారులు మాత్రం 'మాకెందుకులే' అన్నట్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లెదుటే 'ఎర్ర బంగారం' తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టిప్పర్లలో నిండుగా గ్రావెల్ నింపి ఎలాంటి తార్పాలిన్ పరదాలు కప్పకుండా జాతీయ రహదారిపై విచ్చలవిడిగా తీసుకువెళ్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయంలో గాలి తీవ్రతకు మట్టి ఎగిరి వెనుక వచ్చే వాహనదారులపై భారీగా పడుతోంది.
నాయుడుపేట మార్గంలో రోజూ ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు కళ్లలో దుమ్ముపడి, శ్వాస తీసుకోవడం కష్టంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్లలో మట్టిపడటంతో బైకర్లు నియంత్రణ కోల్పోయి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఒకవైపు సీఎం ఆదేశాలు, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ, అధికారుల ఈ ఉదాసీనతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాయుడుపేట మార్గంలో నిత్యం ప్రయాణించే ప్రజల, వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టిప్పర్ల రాకపోకలను తక్షణమే నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలు పాటించకుండా దుమ్ము రేపుతూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న వాహనాలను సీజ్ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




