Guduru: గూడూరు ప్రభుత్వ పాఠశాలకు పెరిగిన ఆదరణ

Guduru: గూడూరు గుండెంగ పాఠశాలలో 51కి చేరిన విద్యార్థుల సంఖ్య. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలకు కొత్త కళ. సన్మానించిన విద్యాశాఖ అధికారులు.

B NARASIMHA, GUDUR
Published on: 18 July 2026 3:31 PM IST
Guduru
X

Guduru: గూడూరు ప్రభుత్వ పాఠశాలకు పెరిగిన ఆదరణ

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల గుండెంగ నందు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు తల్లిదండ్రుల కృషి ఫలితంగా నేడు 51 మంది విద్యార్థులతో పాఠశాల కళకళలాడుతుంది.

విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రాజు మరియు ఉపాధ్యాయ బృందం బడిబాట కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి బోడ రాజమ్మ , ఉప సర్పంచ్ గుగులోత్ మంజుల, మాజీ ఎంపీటీసీ బోడ కిషన్, వార్డు సభ్యులు మరియు రాజకీయ పార్టీల నాయకులను కలిసి పాఠశాల విద్యార్థుల నమోదు చేయించడంలో తోడ్పడాలని కోరగా సర్పంచ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల పున: వైభవానికి కృషి చేస్తామని తీర్మానించడం జరిగింది.

ఈ క్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీ బోడ కిషన్ గారు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చుటకై తీవ్రంగా శ్రమించడం జరిగింది. వారి కృషి ఫలితంగా పాఠశాల విద్యార్థుల సంఖ్య 28 నుండి 51కి పెరిగింది.

ఈ సందర్భంగా నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం రాజు గారి అధ్యక్షతన జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల బలోపేతానికి కృషిచేసిన మాజీ ఎంపిటిసి సభ్యులు శ్రీ బోడా కిషన్ గారిని మండల విద్యాధికారిణి శ్రీమతి ఏ సుజాత గారు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు షాహిద్ అలీ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీ బోడ కిషన్ గారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు మరియు తల్లిదండ్రుల సహకారంతో నేడు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచగలిగామని త్వరలో సుమారు 20 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించి రాబోయే రోజులలో ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. విద్యార్థులకు వసతుల కల్పనలో అధికారులు తోడ్పాటు అందించి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.

పాఠశాల విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు మరియు ఏకరూప దుస్తులను విద్యార్థుల పెంపుకు అనుగుణంగా అందిస్తామని, ఈ గ్రామంలో జరిగిన మార్పును ఆదర్శంగా తీసుకుంటే మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మరియు తల్లిదండ్రుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల నందు విద్యార్థుల నమోదు ఘణనీయంగా పెరిగి ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ వస్తుందని మండల విద్యాధికారిని శ్రీమతి ఏ సుజాత గారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ షాహిద్ అలీ గారు, ఏ ఏ పీ సి అధ్యక్షురాలు శ్రీమతి చీకటి విజయ గారు, పాఠశాల ఉపాధ్యాయులు అనిల్, సువర్ణ, రమేష్, ఉష, సిఆర్పి రవికుమార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story