Nellore: వీఆర్వోలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా కీలక సూచనలు
Nellore: నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా 110 మంది సచివాలయ వీఆర్వోలకు గ్రేడ్-1గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Nellore: వీఆర్వోలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా కీలక సూచనలు
Nellore: ప్రజా సమస్యల పరిష్కారమే ఉద్యోగుల ప్రధాన బాధ్యత అన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. ప్రస్తుత వేగవంతమైన సమాజంలో చిన్న తప్పు చేసినా ప్రజల్లో దోషులుగా నిలబడే పరిస్థితి ఏర్పడిందని, పదోన్నతులు పొందిన వీఆర్వోలకు కలెక్టర్ ప్రేరణాత్మక సందేశం అందించారు. రికార్డు స్థాయిలో 110 మంది సచివాలయాల వీఆర్వోలకు గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 వీఆర్వోలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు కలెక్టర్ హిమాన్షు శుక్లా.
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రతి ఉద్యోగి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లావ్యాప్తంగా వీఆర్వో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కు పదోన్నతులు పొందిన 110 మంది సచివాలయాల వీఆర్వోలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్ నియామక ఉత్తర్వులను అందజేశారు.
పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్‌లు కేటాయించిన సందర్భంగా కలెక్టర్ వీఆర్వోలకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ..
పలు సమస్యలతో తమ వద్దకు వచ్చే ప్రజలను గౌరవించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
విధుల్లో ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా, పారదర్శకంగా ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రస్తుతం వేగవంతమైన సమాజంలో చిన్న తప్పు చేసినా వెంటనే ప్రజల్లో దోషులుగా నిలబడే పరిస్థితి ఉందని, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగి సమాజం తక్కువగా చూసే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు మేలు చేయడమే అంతిమ లక్ష్యంగా ప్రతి ఉద్యోగి పనిచేయాలని అన్నారు. “మన వంతుగా సమాజానికి కొంత మంచి చేశామనే సంతృప్తి కలిగితేనే మన ఉద్యోగానికి న్యాయం చేసినట్టవుతుంది” అని కలెక్టర్ పేర్కొన్నారు.
వీఆర్వోలు ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటారని, వారికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించడం బాధ్యతగా భావించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఒకే విడతలో 110 మందికి పదోన్నతులు కల్పించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలకు వీఆర్వోలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సచివాలయ వీఆర్వోలకు తొలిసారిగా పదోన్నతులు కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసులు, తాసిల్దార్ డానియల్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.




